ఏవీ ఆనాటి సంక్రాంతులు!
రైతుల పంట చేతికొచ్చి లాభాలార్జించి..కొనుగోళ్లు, అమ్మకాలు బాగా జరిగితే వ్యాపారాల్లో లాభాలు..ఇతర వ్యక్తులు వారి పనిచేసే వృత్తుల్లో లాభాలను పొందినప్పుడు ప్రతి ఇంటికీ నిజమైన సంక్రాంతి వస్తుంది. కానీ కాంతులు తీసుకొచ్చే సంక్రాంతి పండగలో ఈ ఏడాది క్రాంతి కనుమరుగైంది. గ్రామాలకు వెన్నెముకగా ఉన్న రైతు..ప్రభుత్వం నుంచి వ్యవ‘సాయం’ అందక అప్పుల ఊబిలో కూరుకుపోయి దిగులుగా ఉన్నాడు. భారీ వర్షాలకు ఈ ఏడాది రెండుమార్లు పంట నీట మునిగింది. కానీ ప్రభుత్వం నుంచి పంట నష్టం ఇప్పటికీ రాలేదు. పంట బీమా కూడా లేకుండా పోయింది. పండిన వరి పంటను కూడా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సక్రమంగా చేపట్టకపోవడంతో ప్రైవేట్ దళారులకే అతి తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చింది. రైతుతో పాటు పల్లెలో ఉన్న పేద, సామాన్య ప్రజలు సైతం సంక్షేమ పథకాలు లేక చేతుల్లో డబ్బులు ఆడక పండగ నాడు సంతోషంగా లేరు. అనకాపల్లి మండలంలో మార్టూరు గ్రామంలో సంక్రాంతి రచ్చబండ ముచ్చట్లు పరిశీలిస్తే..6 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో మూడొంతులు రైతులే... ఏ గడప తట్టినా.. మౌనమే పండగ చేసుకుంటోంది. ఏ వీధికి వెళ్లినా తీరని ఆశల పతంగులు ఎగరేసుకుంటోంది. –సాక్షి, అనకాపల్లి
●చిన్నబోయిన పెద్ద పండగ
అనకాపల్లి మండలం మార్టూరు గ్రామంలో రామాలయం కూడలి వద్ద రచ్చబండ ముచ్చట్లు పెట్టిన ఆ గ్రామ రైతులు, సామాన్య ప్రజలు
ఒమ్మి మధుబాబు (మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్) : అవును..సంక్రాంతి వస్తే గ్రామంలో అసలు సందడే లేదు..నా రాజకీయ చరిత్రలో ఏనాడు ఇలాంటి ప్రభుత్వంను చూడలేదు. కాలయాపనే తప్ప పేదల కోసం..రైతుల కోసం..నిరుద్యోగుల కోసం ఆలోచన చేయడంలేదు. గతంలో ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, ఇంటి వద్దకే రేషన్ వాహనాల ద్వారా గ్రామంలోనే సేవలు అందేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో ఆర్బీకేలో యూరియా వచ్చేది..మెడికల్ కళాశాలలు కడితే దానిని కూడా ఈ ప్రభుత్వం ప్రైవేట్‌కు అమ్మేస్తోంది. విజయవాడలో రూ.1700 కోట్లతో ఎన్‌టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి డబ్బులున్నాయి....మెడికల్ కళాశాల కట్టడానికి, పేదలకు పెట్టుబడి సాయం, సరిపడా యూరియా అందించడానికి మాత్రం డబ్బులు లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. పేదోడికి ఉచిత వైద్యం అందించడానికి కూడా ఆర్థిక స్థోమత లేదా ఈ కూటమి ప్రభుత్వానికి..!
ప్రతి రోజు లాగే అనకాపల్లి మండలంలో మార్టూరు గ్రామంలో మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో రామాలయం ముందు ఉన్న అరుగుపై 12 మంది వరకూ రైతులు, సామాన్య ప్రజలు కూర్చున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో 65 ఏళ్ల వయస్సు ఉన్న తోట నరసింహారావు అనే రైతు ‘‘ సంక్రాంతి పండగ సందడి రెండేళ్లుగా క్రమేపీ మన గ్రామంలో తగ్గుతోంది’ అంటూ ఆవేదన చెందాడు.. దీంతో అక్కడ కూర్చొన్న ఆ గ్రామ రైతులు, సామాన్య ప్రజలు అతని చుట్టూ చేరారు. ఒక్కొక్కరుగా తమ మదిలోని ఆవేదన వెలిబుచ్చారు.
రైతు కరణం జగ్గారావు : ‘అవుర్రా నిజమే..నా చిన్నతనం నుంచి ఏనాడు లేని విధంగా గత రెండేళ్లుగా పండగ హడావుడి పెద్దగా లేదు. నా చిన్నతనం నుంచి ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి నెలగంట ప్రారంభమైతే చాలు.. పండగ మా ఊరికి వచ్చేసినట్లే ఉండేది. కానీ గత సంక్రాంతి, ఈ సంక్రాంతి పండగకు ప్రజల దగ్గర డబ్బులు ఆడ లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతు వ్యవసాయం చేసి అప్పుల ఊబిలో కూరుకు పోయాడుర్రా.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అలా ఉండేది కాదు..అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేవి. మన గ్రామంలో మూడొంతుల రైతులే కదా.. అలాంటి రైతుకు ఇపుడు పెట్టుబడి సాయం, రైతుభరోసా,, పంట బీమా ఏమీ లేవు. అవసరమైన యూరియా కూడా అందకపోవడంతో దిగుబడి తగ్గింది..ఎకరా భూమిలో నాకే నష్టం వచ్చింది..ఇక ఎలా సంక్రాంతి చేసుకుంటాను..’
దంట్ల ప్రకాష్‌రావు (రైతు) : నువ్వు చెప్పింది నిజమే.. ఈ రెండేళ్లలో సంక్రాంతి కళే లేకుండా పోయింది.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మనకి రైతన్న భరోసా ఇచ్చింది...కులవత్తులకు ‘ఆసరా’ ఇచ్చింది..అలాగే మహిళలకు ఆర్థిక ‘చేయూత’ అందించింది. అందుకే ఊరందరి అవసరాల్ని ఊరు తీర్చకపోయినా.. సర్కారు సాయంతో పండగకూ ప్రతి ఇల్లూ కళకళలాడేది. ఇప్పుడు ఎవర్ని అడిగినా ఏముందని పండగ చేసుకోవాలి అంటున్నారు...ఎవరో ఎందుకు మా ఇద్దరు పిల్లలు విశాఖలో రఘు ఇంజినీరింగ్ కళాశాలలోనే బీటెక్ చదువుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇద్దరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చింది. గత రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో అప్పు చేసి ఒక్కరికి ఫీజు కట్టాను. మరొకరి కట్టలేదు. ఒక వైపు వ్యవసాయంలో అప్పులు..మరో వైపు పిల్లల చదువుల కోసం చేసిన అప్పులు...! ఇంకేమి సంక్రాంతి పండగ చేసుకుంటాం.
కరణం జగ్గారావు : నిజమే...నా మూడెకరాల్లో వరి పంట సాగుకు ఈ ఏడాది పెట్టుబడికి రూ.60 వేలు అయ్యింది. అన్నదాత సుఖీభవ రాలేదు..సరైన సమయంలో యూరియా అందక వేయకలేకపోయాను. దిగుబడి కూడా రాలేదు. ఈ ఏడాది కూడా నష్టమే వచ్చింది..ఒక మడి అమ్మితే గానీ వ్యవసాయం చేయలేని పరిస్థితిలో రైతు ఉన్నాడు..(కన్నీళ్లు పెట్టుకుంటూ ) ఏం చేయాలో తెలియక మా పిల్లోడిని మైనింగ్ పనుల్లో కూలీగా పంపిస్తున్నాను..
కోటిన రామారావు (రైతు): నాదీ అదే పరిస్థితి. పెట్టుబడి పెట్టలేకనే నాకున్న ఏడెకరాల భూమిలో 80 సెంట్లు మాత్రమే సాగు చేస్తున్నాను. మిగతాది కౌలుకు ఇచ్చేశాను. మూడు నెలల కిందట మా పొలంకు కావల్సి వచ్చి నేను యూరియా బస్తా కోసం కోపరేటివ్ బ్యాంక్ ముందు 12 గంటల పాటు లైన్‌లో నించుంటే ఒక్క యూరియా బస్తా ఇచ్చారు..
పండగ పూట
ఆర్థిక ఇబ్బందులే..
పల్లె గూటిలో పైసల్లేక సందడి లేదు
యూరియా కొరతతో తగ్గిన ధాన్యం సిరులు
పెట్టుబడి సాయం రాక అప్పుల ఊబిలో రైతు
ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక భారంగా పిల్లల చదువులు
పల్లెలో ఏ ఇంటి గడప తొక్కినా అసంతృప్తే
మార్టూరు గ్రామంలో సంకురాత్రి రచ్చబండ ముచ్చట్లివీ
ఏవీ ఆనాటి సంక్రాంతులు!
ఏవీ ఆనాటి సంక్రాంతులు!


