భోగిమంటల్లో జీవోల ప్రతులు
నక్కపల్లి : గత ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రతులను బుధవారం ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో భోగి మంటల్లో వేసి దహనం చేశారు. రాజయ్యపేట గ్రామంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు బి.బాబ్జీ ఆధ్వర్యంలో విద్యార్థులు జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వైద్య విద్యను పేదలకు చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేసి, నూతన భవనాలను కూడా నిర్మించిందన్నారు. కొన్నిచోట్ల భవనాలు పూర్తయి తరగతులు కూడా ప్రారంభమవుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వం వచ్చి, ఆ 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించి జీవో విడుదల చేసిందన్నారు. వైద్య విద్యను పేదవాడికి దూరం చేసే దారుణానికి ఒడిగట్టిందన్నారు. దేశంలో మోదీ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నట్టే రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్‌లు ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే వైద్యకళాశాలలను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూకరాజు, దేవి, కనక,జాన్ తదితరులు పాల్గొన్నారు.
‘ఉపాధి’ పథకం పేరు మార్చొద్దు...
కె.కోటపాడు : ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు వ్యతిరేకంగా సూర్రెడ్డిపాలెంలో సీపీఎం నాయకులు బుధవారం నిరసన తెలిపారు. ఉపాధి పథకం పేరు మార్పుజీవో ప్రతులను భోగి మంటల్లో వేసి కాల్చివేశారు. సీఐటీయూ మండల కార్యదర్శి నాయుడుబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీరామ్‌జీ పథకం వల్ల ఉపాధి పనులకు వెళ్లే వేతనదారులకు నష్టం కలుగుతున్నట్టు తెలిపారు. ఈ పథకం నిర్వహణకు రాష్ట్రాలు 40 శాతం నిధులు వెచ్చించాలని రాష్ట్రాలపై భారం మోపిందన్నారు. రాష్ట్రాలు ఈ నిధులు వెచ్చించని సమయంలో పథకం నిర్వీర్యమయ్యే పరిస్ధితి ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు వనుము సూర్యనారాయణ, ఈర్లి ముత్యాలనాయుడు, లెక్కల నారాయణమూర్తి, లక్ష్మి, అమ్మాజి పాల్గొన్నారు.
భోగిమంటల్లో జీవోల ప్రతులు


