‘పెద్ద’ల పండగ... తీర్థాలు సంబరంగా...
ముస్తాబవుతున్న గ్రామాలు
గ్రామీణులకు ఆటవిడుపు
నేడు జిల్లాలో మొదటి తీర్థం చోడవరం స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయం వద్ద
నేటికీ చెక్కు చెరగని తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు
చోడవరం : సంవత్సరమంతా ఎండనక, వాననక కాయకష్టం చేసి అలసిపోయే గ్రామీణ ప్రజలకు సంక్రాంతి పండగతో ఆరంభమయ్యే తీర్థ మహోత్సవాలు ఆటవిడుపును ఇస్తాయి. తీర్థాలంటే గ్రామాల్లో బంధువుల మధ్య ప్రేమానుబంధాలు కలిపే పండగలని కూడా చెప్పవచ్చు. ఆలయాలు, గ్రామదేవతల గుడిల వద్ద, పెద్దలుగా పూజించే దివంగత తల్లిదండ్రులు, తాతమామ్మలు, జాతీయ నాయకులు, అభిమాన నేతల విగ్రహాల వద్ద ఈ తీర్ధాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా భోగి పండగ నుంచి గ్రామాల్లో తీర్థాలు ప్రారంభమౌతాయి. ఆదిదేవుడైన చోడవరం శ్రీ స్వయంభూ విఘ్నేరుడి ఆలయం వద్ద జరిగే తీర్థం నుంచి చోడవరం, మాడుగుల పరిసరాలతోపాటు జిల్లా అంతటా ప్రారంభమౌతాయి. కాణిపాకం వినాయకుని తర్వాత అంతటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న చోడవరం శ్రీ స్వయంభూ విఘ్నేరుడి ఆలయం వద్ద భోగి రోజైన బుధవారం మొదటి తీర్థంను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు 50 రోజులకు పైబడి రోజుకి రెండు, మూడు గ్రామాల్లో అన్ని చోట్ల తీర్థాలు నిర్వహిస్తారు. చోడవరం, వడ్డాది, రావికమతం, కొత్తకోట, రోలుగుంట, మాడుగుల, దేవరాపల్లి, కె.కోటపాడు, చౌడువాడ, కశింకోట, యలమంచిలి, నక్కపల్లి, రాంబిల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, అచ్యుతాపురం, తుమ్మపాల, సబ్బవరంతోపాటు అనేక పెద్ద గ్రామాల్లో ప్రముఖ దేవాలయాల వద్ద, తోడపెద్దులను కొలిచే చోట, దివంగతులైన గ్రామపెద్దలను స్మరించే చోట తీర్థాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ తీర్థాల్లో అనేక ప్రత్యేకతలు కనువిందుచేస్తాయి. గిర్రున తిప్పే రంగులరాట్నాలు, నోరూరించే పంచదార చిలుకలు గ్రామీణులకే అందుబాటులో ఉండే నెయ్యిచెక్కీలు, కర్జూరం దుఖాణాలతో పాటు పండగ వాతావరణాన్ని తీసుకువచ్చే రంగురంగుల బెలూన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆయా గ్రామాలలో నిర్వహించే ఎడ్ల బళ్లు, గుర్రం పందాల పోటీలు చిన్నాపెద్దా అందరికీ హుషారు కలిగిస్తాయి. బంధుమిత్రులను ఆహ్వానించి విందు వినోదాలతో అతిథి మర్యాదలు చేయడంతో గ్రామమంతా సందడి నెలకొంటుంది. ఈ తీర్థాల జోరు గ్రామీణులలో హుషారును నింపి కొత్త ఉత్సాహంతో తిరిగి పనీపాటల్లో పాల్గొనేలా చేస్తాయి. తెలుగువారి గ్రామీణ సంస్కృతిని విడువకుండా పూర్వీకుల సంప్రదాయాలను కొనసాగించడం పల్లె ప్రజల ఆత్మీయతకు నిదర్శనంగా నిలుస్తోంది.
‘పెద్ద’ల పండగ... తీర్థాలు సంబరంగా...
‘పెద్ద’ల పండగ... తీర్థాలు సంబరంగా...
‘పెద్ద’ల పండగ... తీర్థాలు సంబరంగా...


