భవన నిర్మాణ సంక్షేమబోర్డు నిధులు ప్రచారానికా..?
రాంబిల్లి(అచ్యుతాపురం): రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డు నుంచి ప్రచార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించడాన్ని అనకాపల్లి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం(సీఐటీయూ) వ్యతిరేకిస్తుందని సంఘం జిల్లా కార్యదర్శి చందక రామకృష్ణ తెలిపారు. ఆయన మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు. భవన నిర్మాణ దారుల నుంచి ఒక శాతం పన్నును వసూల చేసే ప్రభుత్వం ఆ నిధుల నుంచి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి, కార్మికుల పిల్లల చదువులకు స్కాలర్ షిప్‌ల రూపంలోనూ,ప్రమాద బీమా, కార్మికులకు అవసరమైన పనిముట్లను అందజేయు కార్యక్రమాలు చేపట్టాల్సింది పోయి, సంక్షేమ బోర్డు నిధులను ప్రచారానికి కేటాయించడం సరికాదని పేర్కొన్నారు.


