తెగుళ్ల కాలం... రైతులు అప్రమత్తం
అనకాపల్లి : నువ్వు సాగుచేసే రైతులు జనవరి నెలాఖరులోపు వేసుకోవాలని, విత్తేముందు ఆఖరి దుక్కిలో ఎకరాకు 20 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూఫర్ ఫాస్ఫేట్, 15 కిలోల మ్యూరియేట్ ఆఫ్ పొటాష్‌ను వేసుకోవాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ సీహెచ్.ముకుందరావు సూచించారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ కార్యాలయంలో మంగళవారం శాస్త్రవేత్తలతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కలుపు నివారణకు పైరు విత్తిన 2 రోజులలోపు ప్రెటిలాక్లోర్ 2.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. మొక్కజొన్నలో కలుపు నివారణకు టెంబోట్రయోన్ 115 మి.లీ. 200 లీటర్ల నీటికి కలిపి 20–25 రోజులప్పుడు పిచికారి చేయాలని, 25–30 రోజులప్పుడు 55 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలని తెలిపారు.
అపరాలలో బూడి తెగులు నివారణ
రాగిలో కలుపు నివారణకు విత్తిన 2 రోజులలోపు పెండిమితాలిన్ 3 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని, అపరాలలో బూడిద తెగులు ఆశిస్తే నీటిలో కరిగే గంధకం పొడిని 2 గ్రా. లీటరు నీటికి చొప్పున పిచికారి చేయాలని, పల్లాకు తెగులు ఉన్న మొక్కలను పీకి వేయాలని, తెల్లదోమ నివారణకు అసిటామిప్రిడ్ 0.2 గ్రా. లీటరు నీటికి చొప్పున పిచికారి చేయాలని ఏడీఆర్ తెలిపారు. మారుకా మచ్చల పురుగు నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలని, ఉధృతి అధికంగా గమనించిన ప్పుడు ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. ప్లూబెండమైడ్ 0.2 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలన్నారు.
వేరుశనగలో తిక్కా ఆకు తెగులు
వేరుశనగలో తిక్కా ఆకు మచ్చ తెగులు నివారణకు కర్బెండాజిమ్, మాంకోజెట్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి కారిచేయాలన్నారు. వరి నాట్లు వేస్తున్న రైతులు దుమ్ములో ఎకరానికి 35 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్‌ను వేసుకుని 21 నుంచి 25 రోజుల వయసు గల నారును చ.మీటరుకు 44 మూనలు తగ్గకుండా మూనకు 2–3 మొక్కల చొప్పున 15 ఇన్‌టూ 15 సెం.మీ . దూరంలో నాటుకోవాలన్నారు. వరినాటిన 3–5 రోజుల తరువాత కలుపు నివారణకు ప్రెటిలాక్లోర్ 2.0 మి.లీ లీటరు నీటికి పిచికారి చేయాలని, 15–20 రోజుల వయసుగల నాటిన వరిలో కలుపు నివారణకు బిస్‌ఫైరిబాక్ సోడియంను ఎకరాకు 100 మి.లీ. 200 మీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని అన్నారు. చెరకు కార్శి రైతులు వీలైనంత త్వరగా పొలాన్ని ఒకేసారి మోడి చెక్కికార్శి చేసుకోవాలని, కార్శి చేయడానికి ట్రాక్టరుతో నడిచే ష్రడ్డర్ నడపాలని, ష్రడ్డర్ నడపడం కుదరక పొతే మోళ్లు చెక్కి ఎకరాకు 1.25 టన్నుల చెరకు చెత్త పొలమంతా పలుచగా కప్పాలని తెలిపారు. చెరకు మొక్కతోటలు వేసే రైతులు చాళ్ల మధ్య 2 అడుగుల దూరం, జంటల మధ్య 4–5 అడుగుల దూరం ఉంచి నాటుకున్నప్పుడు మంచి దిగుబడులు రావడమే కాకుండా అంతర పంటలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు కె.వి.రమణమూర్తి, వి.గౌరీ, ఆర్.సరిత, ఎ.అలివేణి పాల్గొన్నారు.


