నిర్లక్ష్యం వద్దు
రెవెన్యూ క్లినిక్‌లో భూ వివాదాలను సత్వరమే పరిష్కరించాలి
డీఆర్వో సత్యనారాయణ రావు
పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లకు 317 అర్జీలు
అర్జీదారుల సమస్యలపై
తుమ్మపాల: రెవెన్యూ క్లినిక్ ద్వారా భూ సంబంధిత సమస్యలను సత్వరమే పరిష్కరించనున్నట్టు, పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీదారుల సమస్యలపై క్షేత్రస్థాయిలో పర్యటించి వారు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం– 1, 2లో వేర్వేరుగా నిర్వహించిన పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో ఆయనతోపాటు జిల్లా సర్వే, భూ రికార్డుల సహాయ సంచాలకులు గోపాల్ రాజా, ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎస్ సుబ్బలక్ష్మి, రమామణి, మనోరమ, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి శ్రీనివాస్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, అర్జీదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కారమయ్యే సమస్యలను దరఖాస్తుదారునికి తెలియజేయాలని, పరిష్కారం కాని వాటికి కారణాలు వివరంగా తెలియజేయడం ద్వారా అర్జీలు రీ ఓపెన్ కాకుండా నివారించవచ్చని తెలిపారు. ఈ వారం పీజీఆర్‌ఎస్‌లో 97, రెవెన్యూ క్లినిక్‌కు 220 అర్జీలు మొత్తం 317 అర్జీలు స్వీకరించామన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పూర్ణిమ దేవి, కె. సరోజినీ, శచీదేవి, మనోహర్, సుధీర్ పాల్గొన్నారు.
వెబ్‌ల్యాండ్‌లో తప్పుగా భూముల నమోదు
బీహెచ్‌పీవీ సొసైటీ పేరుతో రెవెన్యూ వెబ్‌ల్యాండ్‌లో తప్పుగా నమోదైన సాగు భూములను సరిదిద్ది రైతుల పేరున చేర్చాలని అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం సర్పంచ్ సాలాపు శాంతి, గ్రామస్తులు రెవెన్యూ క్లినిక్‌లో అధికారులకు ఫిర్యాదు చేశారు. మారేడుపూడి రెవెన్యూ అక్కిరెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో తప్పుగా నమోదైన రైతుల జిరాయితీ భూముల వివరాలను సవరించాలి. ప్రస్తుతం మారేడుపూడి రెవెన్యూలో చేపట్టిన రీసర్వే ప్రకారం విచారణ చేసి రైతులకు న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరారు.
నిర్లక్ష్యం వద్దు


