సంక్రాంతి రద్దీపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి
డాబాగార్డెన్స్ (విశాఖ): సంక్రాంతిని పురస్కరించుకుని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోందని, విశాఖ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి రోజుకు సుమారు 1.50 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి(డీపీటీవో) బి.అప్పలనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సులను ఆదివారం ఆయన ఇతర అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్వారకా బస్‌స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగిందన్నారు. వారాంతం, పండగ సెలవులు కావడంతో గతేడాది కంటే ఈ ఏడాది రద్దీ ఎక్కువగా ఉందన్నారు. గత ఏడాది సంక్రాంతికి 1,050 బస్సులు నడపగా, ఈ ఏడాది ఆ సంఖ్యను మరింత పెంచామన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం రద్దీని బట్టి ఎప్పటికప్పుడు అదనపు బస్సులు నడిపే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రధానంగా శ్రీకాకుళం, రాజాం, పార్వతీపురం, పలాస, ఇచ్ఛాపురం, బొబ్బిలి, సాలూరు, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, హైదరాబాద్‌లకు అధిక సంఖ్యలో బస్సులు నడుపుతున్నామని తెలిపారు. రెగ్యులర్ సర్వీసుల కంటే అదనంగా మరిన్ని ట్రిప్పులు పెంచామన్నారు. పండగ రద్దీ పూర్తయ్యే వరకు 10 మంది అధికారులు, 20 మంది సూపర్‌వైజర్లు 24 గంటల పాటు విధుల్లో ఉంటూ పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. రైళ్లు, విమానాల్లో ఇతర ప్రాంతాల నుంచి విశాఖ చేరుకున్న ప్రయాణికులు.. ఇక్కడి నుంచి తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు బస్టాండ్‌కు వస్తుండటంతో ఆదివారం రద్దీ పెరిగిందన్నారు. ఆయన వెంట డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కె.పద్మావతి, వర్క్ మేనేజర్ అరుణ, కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్ రాజశేఖర్, డిపో మేనేజర్లు సింహాచలం, శరత్, ఉమామహేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.
విశాఖ రీజియన్ నుంచి అదనపు బస్సులు


