సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు
● అలల ఉధృతికి ఫైబర్ బోటు బోల్తా
● క్షేమంగా బయటపడిన
ఆరుగురు మత్స్యకారులు
● గల్లంతైన మత్స్యకారుడి కోసం గాలింపు
అచ్యుతాపురం రూరల్: పూడిమడక వద్ద సముద్రంలో మత్స్యకారుడు గనగల్ల సత్తియ్య (45) గల్లంతయ్యాడు. మైరెన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పూడిమడక గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులతో కలిసి తెల్లవారు జామున నెంబరు ఐఎన్‌డీఏపీవీ3ఎమ్01252 గల బోట్‌పై చేపల వేటకు వెళ్లారు. వేట ముగించుకుని తిరిగి ఒడ్డుకు చేరుకునే సమయంలో మధ్యాహ్నం సుమారు 1.45 గంటలకు సముద్రపు అలల ఉధృతికి ఒక్కసారిగా ఫైబర్ బోటు బోల్తా పడింది. దీంతో నెమ్మదిగా ఆరుగురు మత్స్యకారులు బోటును సరిచేసి బోటులోకి చేరుకున్నారు. సముద్రంలో పడి గల్లంతైన సత్తియ్య ఆచూకీ తెలియలేదని తోటి మత్స్యకారులు తెలిపారు. మైరెన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టు ఇన్‌స్పెక్టర్ ఎస్.సింహాద్రి నాయుడు తెలిపారు. అచ్యుతాపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
పూడిమడక తీరంలో విషాద ఛాయలు
గల్లంతైన గనగల్ల సత్తియ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రులు అతనిపైనే ఆధారపడి ఉండడంతో పూడిమడక గ్రామం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. పిల్లలు చిన్నారులు కావడంతో కుటుంబీకుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. మైరెన్ సిబ్బందితో పాటు మత్స్యకారులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తి గల్లంతవడంతో పూడిమడక సముద్ర తీరం అంతా విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రాణాలతో సత్తియ్య బయట పడాలని మత్స్యకారులు ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నారు. పూడిమడక మత్స్యకార సంఘాల నాయకులు కుటుంబానికి ధైర్యం చెప్పారు.
సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు


