చోరీ కేసులో ఇద్దరు మహిళల అరెస్టు
గొలుగొండ: కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్టు నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ తెలిపారు. గొలుగొండ మండలం కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్‌లో ఆమె శనివారం విలేకరులతో మాట్లాడుతూ కృష్ణదేవిపేట ఇండియన్ బ్యాంక్‌లో ఈనెల5వ తేదీన కృష్ణదేవిపేట గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ రూ 50 వేలు విత్‌డ్రా చేసినట్టు చెప్పారు. ఆమె 8వ తేదీన బ్యాగ్‌లో చూసే సరికి నగదు లేకపోవడంతో కృష్ణదేవిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజీని పరిశీలించి, నగదు విత్‌డ్రా చేసిన సమయంలోనే తాడేపల్లిగూడెంకు చెందిన సంచార జాతి మహిళలైన నాగమణి, దేవిలు చోరీచేసినట్టు గుర్తించామని తెలిపారు. ఆ ఇద్దరిని అరెస్టుచేసి, వారి నుంచి నగదు రికవరీ చేసి కోర్టుకు తరలించినట్టు రూరల్ సీఐ చెప్పారు. ఎస్‌ఐ రుషికేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


