పొర్లు దండాలతో ‘గోవాడ’ రైతుల నిరసన
చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని, రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించాలని కోరుతూ ఫ్యాక్టరీ వద్ద చేపట్టిన రిలే నిరసన దీక్షలు శుక్రవారానికి 8వ రోజుకు చేరాయి. ఇందులో భాగంగా పొర్లు దండాలతో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఫ్యాక్టరీని తెరిపించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వామపక్ష నాయకుడు రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ బకాయిలు చెల్లించకపోవడంతో పెట్టుబడులు పెట్టి చెరకు పండించిన రైతులు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గతేడాది చెరకు సరఫరా చేసినా నేటికి చెల్లింపులు చేయకపోవడం దారుణమన్నారు. దీంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు విలవిల్లాడుతున్నారన్నారు. ఫ్యాక్టరీ కార్మిక సంఘం నాయకుడు శరగడం రామునాయుడు మాట్లాడుతూ కార్మికులకు జీతాలు లేక కుటుంబాలతో రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ చైర్‌పర్సన్ అయిన జిల్లా కలెక్టర్‌కు రైతులు, కార్మికులు తమ సమస్యలు గురి తెలియజేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఈ దీక్షలో సీపీఐ మండల కార్యదర్శి సోమాదల దేవి, కోన మోహన్, శానాపతి సత్యారావు, మహిళా సమాఖ్య కార్యకర్త బొబ్బిలి దేవి, దండుపాటు తాతారావు, తనకల జగన్, రాయి సూరిబాబు, పొలిమేర వెంకటప్పారావు, మద్దాల మహాలక్ష్మినాయుడు, ఎం.మల్లేశ్వరరావు, ఎస్.మల్లేశ్వరరావు, రైతులు, కార్మికులు పాల్గొన్నారు.


