మరీ ఇంత మోసమా?
దేవరాపల్లి: రైవాడ జలాశయంలో చేప పిల్లలను అరకొరగా విడుదల చేసి, మరోమారు మోసగించేందుకు యత్నించిన మత్స్యశాఖ అధికారులపై స్థానిక వేటదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైవాడ జలాశయంలో విడుదల చేసేందుకు విజయనగరం జిల్లా తాటిపూడి నుంచి 1.50 లక్షల చేప పిల్లలను శుక్రవారం తీసుకొచ్చారు. గతంతో ఇచ్చిన హామీకి, ఇప్పుడు తీసుకొచ్చి చేపపిల్లల సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఉండడంతో వారు మండిపడ్డారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగి, నినాదాలుచేశారు. ఈ జలాశయంలో ఐదు లక్షల చేపపిల్లలను వేస్తామని చెప్పిన అధికారులు గత ఏడాది నవంబర్‌లో కేవలం 50 వేల చేప పిల్లలను వేశారు. అయితే అధికారులు తమను మోసం చేశారని ఆరోపిస్తూ వేటదారులు అప్పట్లో ఆందోళన చేశారు. దీంతో మిగిలిన 4.50లక్షల చేపపిల్లలను రెండువారాల్లో జలాశయంలో వేస్తామని లిఖిత పూర్వకంగా అధికారులు హామీ ఇచ్చారు. నెలన్నర తరువాత శుక్రవారం వచ్చిన అధికారులు 1.50 లక్షల చేపపిల్లలను మాత్రమే తీసుకొచ్చారు. మరోమారు మోసం చేసేందుకు యత్నించిన అధికారులపై వేటదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మోసంపై ప్రశ్నించిన తమపై అధికారులు దురుసుగా ప్రవర్తించారని వేటదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేటదారులు, మత్స్యశాఖ అధికారుల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. అధికారుల తీరును నిరసిస్తూ జలాశయం గట్టుపై చేపపిల్లలతో వచ్చిన వాహనం ఎదుట వేటదారులు ఆందోళనకు దిగారు. వాహనం ముందు బైఠాయించి, మత్స్యశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 4.50లక్షల చేప పిల్లలను జలాశ యంలో వేయాలని లేకుంటే, వెనక్కి తీసుకుపోవాలని భీష్మించుకు కూర్చున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తే అధికారులు దురుసుగా ప్రవర్తించడాన్ని వేటదారులు తీవ్రంగా పరిగణించారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ వి.సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా మత్స్యశాఖ అధికారి వి.విజయ ఫోన్లో వేటదారులతో మాట్లాడి ప్రస్తుతం తీసుకువచ్చిన పిల్లలను విడుదల చేస్తే మిగిలిన వాటిని సంక్రాంతి లోగా పంపిస్తానని హామీ ఇచ్చారు. దీంతో వేటదారులు శాంతించి, చేప పిల్లలను జలాశయంలో వేసేందుకు అంగీకరించారు.
మృతి చెందిన చేప పిల్లలు
జలాశయంలో వేసేందుకు తీసుకొచ్చిన చేపపిల్లలు అప్పటికే మృతి చెందినట్లు వేటదారులు గుర్తించారు. కొన్ని చేపపిల్లలు జలాశయం నీటిపై తేలియాడటంతో మరణించినట్లుగా ధ్రువీకరించారు. మృతి చెందిన చేప పిల్లలను విడుదల చేయొద్దని వేటదారులు సూచించినప్పటికీ మత్స్యశాఖ అధికార్లు పట్టించుకోలేదు. ఉదయం 10 గంటలకు వస్తాయని చెప్పి సాయంత్రం 4 గంటలకు తీసుకువచ్చారని, ఆలస్యంగా తీసుకురావడంతోనే చేప పిల్లలు చనిపోయాయని, ముమ్మాటికి అధికార్లు నిర్లక్ష్యమేనని ఆరోపించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వేటదారులు డిమాండ్ చేశారు. ఇలా అరకొరగా చేప పిల్లలను వేస్తే రోజంతా వేట సాగించినా కేజీ చేపలు కూడా లభించవని వారి గోడును వెల్లబోసుకున్నారు. మత్స్యశాఖ అధికారుల అలసత్వం కారణంగా రైవాడ జలాశయంలో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 250 కుటుంబాల వారు జీవనోపాధిని కోల్పోవలసిన దుస్థితి నెలకొందని వాపోయారు. శుక్రవారం తీసుకొచ్చిన చేప పిల్లలలో కొన్నైనా బతికి ఉంటాయని జలాశయంలో విడుదల చేశారని, అవి పూర్తిగా చనిపోయినట్లు తన దృష్టికి వచ్చిందని డీఎఫ్‌వో విజయ తెలిపారు. చనిపోయిన వాటితో సంబంధం లేకుండా 4 లక్షల చేప పిల్లలను జలాశయంలో విడుదల చేస్తామన్నారు.
మత్స్యశాఖ అధికారులపై
రైవాడ వేటదారుల మండిపాటు
జలాశయంలో విడుదలకు అరకొరగా చేప పిల్లలను తేవడంపై ఆగ్రహం
వాహనం ఎదుట బైఠాయించి నిరసన
వేటదారులు, మత్స్యశాఖ అధికారుల మధ్య వాగ్వాదం, ఉద్రిక్తత
ఉన్నతాధికారుల హామీతో శాంతించిన వేటదారులు
మరీ ఇంత మోసమా?
మరీ ఇంత మోసమా?


