38 రోడ్ల పనులకు రూ.113 కోట్లు
● రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక
ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు
తుమ్మపాల: జిల్లాలో 38 రోడ్ల పనులకు రూ.113 కోట్లు మంజూరు చేసినట్టు రోడ్లు, భవనాల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. జిల్లాలో జరుగుతున్న రోడ్ల పనులను శుక్రవారం కలెక్టర్ విజయ కృష్ణన్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీటిలో 22 పనులకు టెండర్లు పూర్తయ్యాయని, మిగిలిన పనులు టెండర్లు దశలో ఉన్నాయని చెప్పారు. ఈ పనులన్నింటినీ జూన్ నాటికి పూర్తిచేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో రూ.3వేల కోట్లతో రోడ్లను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఈ పద్ధతిలో ఈ ఏడాది రూ.20 వేల కోట్లతో రోడ్లు నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో 10,500 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి పనులకు సంబంధించి అన్ని అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు. అనకాపల్లి, విశాఖ జిల్లాలకు ముఖ్యమైన అడ్డురోడ్డు–నర్సీపట్నం, భీమిలి–నర్సీపట్నం, వడ్డాది–పాడేరు రోడ్డుపనులు పూర్తిచేయనున్నట్టు చెప్పారు. ఎండీపీ పథకం ద్వారా రూ.130 కోట్లతో చేపట్టిన 62 కిలోమీటర్ల రోడ్ల పనులను మార్చి నాటికి పూర్తిచేయనున్నట్టు తెలిపారు. ఈ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లింపులు జరుగుతున్నాయని, ఇప్పటివరకు రూ.60 కోట్లు చెల్లించామని చెప్పారు. రూ.70 కోట్ల బకాయిలు ఈ నెలలో చెల్లిస్తామని చెప్పారు. ధ్వంసమైన రోడ్ల అభివృద్ధికి రూ.800 కోట్లు మంజూరయ్యాయన్నారు. గ్రామీణ రోడ్లలో కూడా భారీ వాహనాల రద్దీ పెరిగిన నేపథ్యంలో ముఖ్యమైన రహదారులను జాతీయ రహదారుల స్థాయి ప్రమాణాలతో నిర్మించేందుకు పీపీపీ పద్ధతిలో చేపట్టనున్నట్టు చెప్పారు. పనులు జరుగుతున్నప్పుడు 40 శాతం, తదుపరి 15 ఏళ్లలో 60 శాతం నిధులు దశల వారీగా చెల్లింపులు చేస్తామన్నారు. అధిక లోడు వాహనాలను నియంత్రించేందుకు ఫిబ్రవరి నుంచి టోల్ గేట్ల వద్ద ఆటోమేటిక్ లోడు పరిశీలన యంత్రాలను ఏర్పాటుచేసి, ఆర్‌టీజీఎస్‌తో అనుసంధానం చేసి జరిమానాలు విధించే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయ కృష్ణన్, రోడ్లు భవనాల శాఖ ఎస్‌ఈ కె.జె.ప్రభాకర్, ఈఈ ఎన్.సాంబశివరావు పాల్గొన్నారు.


