మోతాదుకు మించి ఎరువుల వినియోగం అనర్థదాయకం
మునగపాక పీఏసీఏస్ ఆవరణలోని ఎరువుల గొడౌన్‌లో రికార్డులు పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి
మునగపాక: మోతాదుకు మించి ఎరువులు వినియోగించడం వల్ల రైతులకు నష్టాలు తప్ప ఫలితం ఉండదని వ్యవసాయ శాఖ జేడీ ఎం.ఆశాదేవి తెలిపారు. గురువారం ఆమె మునగపాక పీఏసీఎస్ ఆవరణలోని ఎరువుల గొడౌన్‌ను తనిఖీ చేశారు. ఎంతమేర యూరియా వచ్చింది.. ఇంత వరకు ఎంత మందికి పంపిణీ చేశారన్న వివరాలతో కూడిన రికార్డులను పరిశీలించారు. అనంతరం రైతుల వద్దకు వెళ్లి మాట్లాడారు. యూరియా వినియోగంలో రైతులు తగు జాగ్రత్తలు వహించాలన్నారు. గడ్డికి యూరియాను ఎక్కువ మోతాదులో వేయడం ద్వారా పశువులకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులు నానో యూరియాపై దృష్టి సారించాలన్నారు. గత ఖరీఫ్‌లో అవసరం కన్నా ఎక్కువ మొత్తంలో యూరియా అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రబీకి డివిజన్ పరిధిలో 15,559 టన్నుల మేర యూరియాను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు సుబ్రహ్మణ్యం, మండల వ్యవసాయాధికారి సీహెచ్ జ్యోత్స్నకుమారి, వీవోఏ లలిత, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు దాడి ముసిలినాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఈ–పంట నమోదుపై దృష్టి
ప్రభుత్వం నుంచి రైతులకు ఎటువంటి సాయం అందాలన్న తప్పనిసరిగా ఈ–పంట నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ ఎం.ఆశాదేవి కోరారు. ఇందుకోసం అధికారులు గ్రామాల్లోకి వచ్చే నమోదు చేసుకునే సమయంలో రైతులు అందుబాటులో ఉండాలన్నారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 6,21,580 ఎల్‌పీలు లక్ష్యం కాగా.. ఇంతవరకు 56 వేలకు పైగా ఈ–పంట నమోదు చేసుకున్నారన్నారు. రబీలో ఈ–పంట నమోదు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


