24 గంటల్లోనే బంగారం దొంగ పట్టివేత
రావికమతం : చోరీ జరిగిన 24 గంటల్లోనే కొత్తకోట పోలీసులు కేసు చేధించి దొంగలను పట్టుకుని రూ.6 లక్షల విలువైన మూడున్నర తులాల బంగారు హారంను రికవరీ చేశారు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జెడ్.కొత్తపట్నంకు చెందిన పైలా వెంకటలక్ష్మి ఆటోలో ప్రయాణిస్తుండగా రూ.6 లక్షల విలువైన బంగారం హారం పోగొట్టుకుంది. ఆమె మంగళవారం గ్రామానికి చెందిన మరో మహిళతో కలిసి నర్సీపట్నం స్టేట్‌బ్యాంక్‌కి వెళ్లి తాను కుదవ పెట్టిన బంగారం విడిపించుకొని చేతిసంచిలో పెట్టుకుంది. అనంతరం సంక్రాంతి పండగకు వస్త్రాలు కొనుగోలు చేసి సాయంత్రం నర్సీపట్నం పీవీఆర్ సినీమాక్స్ సెంటర్‌లో రావికమతానికి చెందిన ఆటో ఎక్కారు. అప్పటికే ఆటోలో మరో ఇద్దరు మహిళలు, మరో యువకుడు ఉన్నారు. యువకుడు చెట్టుపల్లిలో ఆటో దిగి వెళ్లిపోగా, ఇద్దరు మహిళలు రోలుగుంటలో దిగి వెళ్లిపోయారు. వెంకటలక్ష్మి కొత్తకోటలో ఆటో దిగి ఆటో డ్రైవర్‌కి డబ్బులు ఇవ్వడానికి బ్యాగ్‌ను తీయగా బంగారం అభరణం కనిపించలేదు. దీంతో హారం చోరీ అయిందని గ్రహించి ఆమె కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాస్, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ భాస్కర్, అర్జున్, కానిస్టేబుల్ జల్లిబాబుతో కలిసి విచారణ ప్రారంభించారు. ఆటో వెళ్లిన దారిలో సీసీ కెమెరాల్లో రికార్డు అయన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఎఎన్‌ఆర్ కెమెరా సహాయంతో పోలీసులు బందాలుగా ఏర్పడి చాకచక్యంగా వ్యవహరించి నిఘా పెట్టారు. మాడుగుల, కొత్తవలస ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని బంగారు హారం, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు మైనర్‌గా గుర్తించారు. చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. రికవరీ చేసిన బంగారు హారంను కోర్టు అనుమతితో బాధితురాలు వెంకటలక్ష్మికి అప్పగిస్తామని సీఐ తెలిపారు. బంగారం చోరీ కేసును 24 గంటల్లోనే ఛేదించి సొత్తు రికవరీ చేసిన కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ భాస్కర్, అర్జున్, సిబ్బంది జల్లిబాబు, సప్తగిరి తదితర సిబ్బందిని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు.


