విద్యార్థి వైద్యానికి ‘మనం’ చేయూత
విద్యార్థిని కుటుంబానికి రూ.లక్ష చెక్కు అందిస్తున్న ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, సీఐ ధనుంజయరావు
యలమంచిలి రూరల్: బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న పేద విద్యార్థినికి మేమున్నామంటూ యలమంచిలికి చెందిన మనం చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు చికిత్స నిమిత్తం రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. రాంబిల్లి మండలం మామిడివాడ కొత్తూరు జెడ్పీ హైస్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న కొప్పోజు పావని ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైంది. తల్లిదండ్రులు విశాఖ కేజీహెచ్‌కు చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా వైద్యులు బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టు తెలిపారు. దీని వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని, చికిత్స చేయించాలని సూచించారు. పావని తల్లిదండ్రులకు అంత ఆర్థిక స్థోమత లేదని, ఆర్థిక సాయం అందజేయాలని విద్యార్థిని చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయురాలు అద్దాల అనిత మనం ట్రస్టు ప్రతినిధులను కోరారు. ఈ మేరకు ట్రస్టు ప్రతినిధులు గురువారం విద్యార్థిని కుటుంబానికి మున్సిపల్ కమిషనర్ బీజేఎస్ ప్రసాదరాజు, ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, సీఐ ధనుంజయరావు చేతుల మీదుగా రూ.లక్ష ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్రి వీరునాయుడు మాస్టారు, మురుకుర్తి గోపి, పి.సురేష్, ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు.


