50 ఎకరాల్లో సరుగుడు తోటలు దగ్ధం
● రూ.1.50 కోట్ల ఆస్తి నష్టం
బుచ్చెయ్యపేట : మండలంలో గల చింతపాక, గున్నెంపూడి గ్రామాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 50 ఎకరాల్లో సరుగుడు తోటలు దగ్గం కాగా కోటి 50 లక్షలు వరకు ఆస్ధినష్టం జరిగింది. బుధవారం మధ్యహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. గ్రామానికి కిలోమీటరన్నర దూరంలో ఉండటంతో రైతులు అగ్ని ప్రమాదాన్ని ముందుగా గుర్తించలేదు. సరుగుడు తోటల్లో నుండి పొగ రావడంతో రైతులు తీవ్ర ఎండలో పొలాల్లోకి పరుగులు తీశారు. అప్పటికే చాలా మంది రైతుల సరుగుడు తోటలు పూర్తిగా మంటల్లో కాలిపోగా మిగిలిన రైతులంతా కలిసి మంటలను అదుపు చేశారు. చింతపాకతో పాటు పక్కనే ఉన్న రావికమతం మండలం గొంప రెవిన్యూ వరకు మంటలు వ్యాపించాయి. చింతపాక రెవిన్యూలో ఉన్న సోమయాజులు చెరువు కింద ఉన్న భూముల్లో కొంగా నాగరాజు,రమణ,రాజు,సలాది సత్యం, నాగరాజు,పరవాడ నాగరాజు,బంగారు నాయుడు,పరవాడ తమ్మునాయుడు,పాకంశెట్టి సన్యాసిరావు,కొంగా రాజబాబు,సలాది గణ,సత్తిబాబు,చెల్లిబాబు,దుర్గమ్మ,శాంభయ్య,నూకాలమ్మ,నిట్టా సత్తిబాబు తదితర రైతుల సరుగుడు తోటలు కాలిపోయాయి. సుమారు 80 మంది రైతులకు చెందిన సరుగుడు తోటలు కాలిపోగా రూ.కోటి 50 లక్షలు వరకు ఆస్ధి నష్టం జరిగిందని బాధిత రైతులు వాపోయారు. మంటలు ఆర్పడానికి 101కి ఫోన్ చేయగా విశాఖ అగ్నిమాపక అధికారులు ఫోన్‌లో మాట్లాడి రావికమతం అగ్నిమాపక అధికారులు నెంబర్ 08934 226111కి ఫోన్ చేయమన్నారు. ఈ నెంబర్‌కు ఫోన్ చేసినా పని చేయలేదని బాధిత రైతులు తెలిపారు. దీనిపై రావికమతం అగ్నిమాపక సిబ్బందిని వివరణ కోరగా విద్యుత్ సరఫరా లేకపోతే ఫోన్ పనిచేయదన్నారు. ఒక్కో రైతుకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.


