ఈదురు గాలుల బీభత్సం
నక్కపల్లి: శనివారం సాయంత్రం వీచిన బలమైన ఈదురుగాలులకు పలు గ్రామాల్లో అరటి, మామిడి, జీడి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. సాయంత్రం విపరీతమైన ఈదురు గాలులు వీచాయి. చీడిక కొత్తూరులో నర్సింగరావుకు చెందిన సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో వేసిన అరటి పంటకు నష్టం వాటిల్లింది. గాలులకు అరటి చెట్లు నేలకూలిపోయాయి. అరటి గెలలు పక్వానికి రాకముందే నేలకొరిగి పోవడంతో తీవ్రనష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. డొంకాడ, సీతానగరం, రమణయ్యపేట, రేబాక, చీడిక, కొత్తూరు, తదితర గ్రామాల్లో వేసిన బొప్పాయి చెట్లు కూడా నేలకూలాయి. పిందె దశలో ఉన్న మామిడికి కూడా నష్టం వాటిల్లిందని, మామిడి కాయలు నేలరాలాయని రైతులు చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది.
విద్యుత్ సరఫరాకు అంతరాయం
దేవరాపల్లి: ఈదురు గాలులతో కూడిన వర్ష బీభత్సానికి మండలంలోని పది గ్రామాలలో 21 విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతోపాటు మూడు లక్షల మేర నష్టం జరిగి ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్తపెంట కోనేరు వద్ద విద్యుత్ తీగలపై తాటిచెట్టు పడిపోవడంతో ఐదు విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. వేచలం చీకటితోట వద్ద 4 స్తంభాలు, ఎన్.గజపతినగరంలో 2, వేచలం గ్రామంలో 4, కలిగొట్ల శివారు బండారుపాలెంలో 2, బి.కింతాడ కొత్తూరులో 4 స్తంభాలు పడిపోయాయి. ఎలక్ట్రికల్ ఏఈ కర్రి శంకరరావు ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు.
ధ్వంసమైన అరటి తోటలు
నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
ఈదురు గాలుల బీభత్సం


