సమావేశమే జరగకుండా తీర్మానమా?
తారస్థాయికి.. కూటమి కుయుక్తులు
● మేయర్ మార్పు కోసం నిబంధనలకు పాతర ● అజెండా అంశాన్ని.. తీర్మానంగా పేర్కొంటూ కలెక్టర్ నోటీస్ ● 58 మంది కార్పొరేటర్లు అవిశ్వాసాన్ని ప్రతిపాదించినట్లు వెల్లడి ● అజెండాలో చర్చించకుండానే.. ప్రతిపాదన ఎలా సాధ్యమంటున్న సభ్యులు ● కలెక్టర్ నోటీసుపై సర్వత్రా అనుమానాలు
ఎంవీపీకాలనీ : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లో కూటమి ప్రభుత్వం కుయుక్తులు తారస్థాయికి చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ మేయర్ మార్పు అంశం పెద్ద చర్చనీయాంఽశంగా మారింది. నిజానికి గ్రేటర్ విశాఖలో కూటమి ప్రభుత్వానికి మేయర్‌ను మార్పు చేసేంతగా బలం లేదు. అయినప్పటికీ ఫిరాయింపులకు తెరతీయడం ద్వారా నగర మేయర్‌ను మార్పు చేయాలని గత కొంతకాలంగా కూటమి ప్రయత్నాలు చేస్తోంది. సాంకేతికంగా మార్పు సాధ్యం కానప్పటికీ దొడ్డిదారిలో కథ నడిపించేందుకు కూటమి నాయకుల సారధ్యంలో జిల్లా ఉన్నతాధికారులు పావులు కదుపుతున్నారు. తాజాగా 58 మంది కార్పొరేటర్లు మేయర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారంటూ కలెక్టర్ నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు సమావేశమే జరగకుండా జిల్లా కలెక్టర్/జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ అవిశ్వాస తీర్మాన నోటీసు ఎలా జారీ చేస్తారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తీర్మానంపై సర్వత్రా అనుమానాలు
మేయర్ మార్పు అంశంపై కూటమి నాయకుల సారథ్యంలో ఉన్నతాధికారులు చేస్తున్న నిర్ణయాలపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేయర్ మార్పు అంశంపై ఇప్పటి వరకు కౌన్సిల్‌లో ఎలాంటి చర్చ జరగలేదు. ఈ నెల 19న కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉండగా..నిబంధనల ప్రకారం ఈ అంశాన్ని అజెండాలో మాత్రమే చేర్చాల్సి వుంది. అనంతరం 19న దీనిపై చర్చ జరిపి కార్పొరేటర్ల ప్రతిపాదనలు మేరకు అవిశ్వాసంపై తీర్మానం పెట్టే వీలుంటుంది. అయితే ప్రస్తుతం అజెండా అంశంగా ఉన్న మేయర్ మార్పుపై తీర్మానం జరిగినట్లు కలెక్టర్/ జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ నోటీసు విడుదల చేయడం కూటమి అడ్డగోలు వ్యవహారానికి అద్దం పడుతోంది. పైగా తీర్మానాన్ని 58 మంది కార్పొరేటర్లు ప్రతిపాదించినట్లు కలెక్టర్ ఆ నోట్‌లో వెల్లడించడంపై అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. తీర్మానంపై 58 మంది సభ్యులు సంతకం చేసిన ప్రతిని కౌన్సిల్ సభ్యులందరికీ పంపించినట్లు కూడా కలెక్టర్ తన నోటీసులో పేర్కొన్నారు. అయితే అలాంటి ప్రతులు శుక్రవారం అర్ధరాత్రి వరకు తమకు ఏమీ అందలేదని పలువురు కౌన్సిల్ సభ్యులు వెల్లడించారు. దీంతో జిల్లా ఉన్నతాధికారుల తీరుతో పాటు కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ఈ అడ్డగోలు వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సమావేశమే జరగకుండా తీర్మానమా?
సమావేశమే జరగకుండా తీర్మానమా?


