ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తే కార్మికుల జీతాల్లో కోత
ఆలోచన విరమించాలంటూ మున్సిపల్ వర్కర్ల ఆందోళన
నర్సీపట్నం: ఔట్‌సోర్సింగ్ వర్కర్లను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించరాదు.. పర్మినెంట్ చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ ఆప్కాస్‌లో ఉన్న మున్సిపల్ శానిటేషన్, వాటర్ సప్లయి, ఇతర విభాగాల ఔట్‌సోర్సింగ్ వర్కర్లను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఔట్‌సోర్సింగ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలన్నారు. ఈ అంశంపై కొన్నేళ్లుగా పోరాడితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆప్కాస్ పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని చూస్తుందన్నారు. ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తే నెలనెలా జీతాలు చెల్లించకపోగా కార్మికుల జీతాల్లో కోత విధిస్తారన్నారు. కార్మికులపై వేధింపులు పెరుగుతాయన్నారు. ఆప్కాస్‌ను రద్దు చేస్తే పర్మినెంట్ చేయాలన్నారు. ధర్నాలో యూనియన్ నాయకులు కె.రాజు, రమణ, అర్జమ్మ, మహేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


