క్వారీ లారీలు | - | Sakshi
Sakshi News home page

క్వారీ లారీలు

Mar 19 2025 1:26 AM | Updated on Mar 19 2025 1:21 AM

●పడగ విప్పిన మైనింగ్‌ మాఫియా
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత క్వారీ లారీలు పెరిగాయి. విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ప్రజల ప్రాణాలంటే, ప్రభుత్వ ఆస్తులంటే లెక్కలేని రీతిలో ఏది ఎదురుపడితే దానిని ఢీకొట్టి వెళ్లిపోతున్నాయి. పరిమితికి మించి అధిక లోడ్‌తో వెళ్లడమే ఇందుకు కారణం. రాంబిల్లి మండలంలో నేవల్‌ పనుల కోసం ప్రైవేటు ఆపరేటర్లు పెద్ద పెద్ద బండరాళ్లను, నల్లరాయిని, రోడ్డు మెటల్‌ను పెద్ద స్థాయిలో రవాణా చేస్తున్నారు. దీని వెనుక ఓ బడా ప్రజాప్రతినిధి ఉండడమే నిర్వాహకులు చెలరేగిపోవడానికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మునగపాక మెయిన్‌రోడ్డులో మితిమీరిన వేగంతో వచ్చిన క్వారీ లారీ ఢీకొని కొద్ది రోజుల క్రితం మాడా కన్నారావు అనే ఎల్‌ఐసీ ఏజెంట్‌ మృతి చెందారు. సోమవారం అనకాపల్లి టౌన్‌లో విజయరామరాజు పేట వద్ద గల రైల్వే అండర్‌ బ్రిడ్జి గడ్డర్‌ను క్వారీ లారీ ఢీకొనడంతో విరిగిపోయింది. సకాలంలో రైల్వే సిబ్బంది స్పందించడంతో భారీ ప్రమాదం తప్పింది.
కాటేస్తున్న
● కూటమి ప్రభుత్వంలో పెరిగిన మైనింగ్‌ అక్రమ తవ్వకాలు ● ప్రజా ప్రతినిధుల అండతో చెలరేగిపోతున్న క్వారీ యాజమాన్యాలు ● పరిమితి మించి అధిక లోడ్‌తోనే ప్రమాదాలు ● రోజుకు 300 –350 క్వారీ లారీల రాకపోకలు ● కమిషన్‌ కోసం అతి వేగంగా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు ● మొన్న మునగపాకలో క్వారీ లారీ ఢీకొని ఎల్‌ఐసీ ఏజెంట్‌ మృతి ● నిన్న క్వారీ లారీ ఢీకొనడంతో దెబ్బతిన్న రైల్వే గడ్డర్‌

సాక్షి, అనకాపల్లి:

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జిల్లాలో మైనింగ్‌ మాఫియా పెరిగింది. కొండలను పిండి చేసి నల్లరాయిని దర్జాగా అమ్ముకుంటున్నారు. కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనూ అనుమతులకు మించి, పరిధి దాటి రాయి తవ్వకాలు చేపట్టడమే కాకుండా.. నిబంధనలకు విరుద్ధంగా వాటిని తరలిస్తున్నారు. పెద్ద పెద్ద బండరాళ్లను, నల్లరాయిని, రోడ్డు మెటల్‌ను రాంబిల్లి మండలంలో నేవీ ప్రత్యామ్నాయ ఆపరేషన్‌ బేస్‌కు రవాణా చేస్తున్నారు. సముద్ర తీరంలో జెట్టీ నిర్మాణానికి, బ్రేక్‌ వాటర్స్‌ కోసం భారీ ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు పెద్ద పరిమాణంలో వుండే బండరాళ్ల అవసరం ఏర్పడింది. ఇదే అదునుగా మైనింగ్‌ అధికారుల సహకారంతో అనకాపల్లి, రోలుగుంట, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో రాయి క్వారీల నిర్వాహకులు నేవల్‌ బేస్‌ పనులకు బండరాళ్ల సరఫరా కోసం సంబంధిత కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకున్నారు. చాలా వరకు అనుమతులు లేకుండానే ఇవి జరిగిపోయాయి. ఆయా మండలాల్లోని క్వారీల నుంచి నిత్యం వందలాది టిప్పర్లలో పెద్ద పెద్ద బండరాళ్లను తరలిస్తున్నారు.

అనుమతి లేనివే ఎక్కువ

జిల్లాలో గనుల శాఖ అనుమతి వున్న రాయి/కంకర క్వారీలు 60 మాత్రమే ఉన్నాయి. కానీ ఒక్క అనకాపల్లి డివిజన్‌లోనే ఎటువంటి అనుమతులు లేకుండా 150కి పైగా క్వారీలు నడుస్తున్నాయి. అనకాపల్లి మండలంలోని మార్టూరు, మామిడిపాలెం, మాకవరం, ఊడేరు, కుంచంగి, కూండ్రం పరిసరాల్లో అనుమతి లేని రాయి క్వారీలు పదుల సంఖ్యలో ఉన్నాయి. రోలుగుంట, రావికమతం, మాకవరపాలెం మండలాల్లో కూడా క్వారీలు అక్రమంగా నడుస్తున్నాయి. అనకాపల్లి మండలంలోని క్వారీల నుంచి నిత్యం వందల సంఖ్యలో టిప్పర్లు, లారీల్లో బండరాళ్లను తరలిస్తున్నారు. ఒకటి, రెండు ప్రముఖ సంస్థల పేరున ఉన్న లీజు పత్రాల ఆధారంగా నకిలీ వేబిల్లులతో అనధికార క్వారీల నుంచి కంకర, నల్లరాయి రవాణా చేస్తున్నారు. గనులు, రవాణా, పోలీసు శాఖల తనిఖీలు నామమాత్రం కావడం, కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు అండగా వుండడంతో అక్రమ క్వారీల నిర్వాహకుల వ్యాపారం మూడు టిప్పర్లు, ఆరు లారీల చందంగా సాగిపోతున్నది. స్థానికులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. గనుల శాఖ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు అప్పుడప్పుడు క్వారీల్లో తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. కొన్ని వాహనాలను స్వాధీనం చేసుకొని మొక్కుబడిగా అపరాధ రుసుం విధించి వదిలేస్తున్నారు. అక్రమంగా తరలిపోతున్న దానిలో అధికారులు పట్టుకుంటున్నది పట్టుమని పది శాతం కూడా ఉండడంలేదు.

క్వారీ లారీలను

అడ్డుకున్న రైతులు,

స్థానిక ప్రజలు

రోజు రోజుకూ క్వారీ యాజమాన్యాలకు, స్థానిక రైతుల మధ్య వివాదాలు తీవ్రతరం అవుతున్నాయి. మా మాట వినండి, మాకు నష్టం చేకూర్చే క్యారీలు ఆపండని బాధిత రైతులు కోరుతున్నా.. మైనింగ్‌, పోలీస్‌ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. స్థానిక కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు అండతో క్వారీ యాజమాన్యాలు చెలరేగిపోతున్నారు. దీంతో రెండు రోజుల క్రితమే క్వారీ లారీలను శరభవరం, రాజన్నపేట, గొల్లపేట, వడ్డిపె గ్రామాల్లో రైతులు అడ్డుకున్నారు. ఆందోళనలు కూడా చేశారు. వారం రోజుల క్రితం వరకూ సుమారు 25 రోజుల పాటు నల్లరాయి రవాణా ఆపిన యజమాన్యం మరలా ఈ రవాణా కొనసాగించింది. దీంతో పై గ్రామాలవారు క్వారీ నిర్వహణ ప్రాంతం సమీపంలో రవాణా ఆపాలి, కొండలు పేల్చడం ఆపాలంటూ యాజమాన్యాన్ని కోరారు. వినకపోవడంతో అడ్డుకున్నారు. తమకు కూటమి ప్రభుత్వ నేతలు అండగా ఉన్నారని బహిరంగంగా చెబుతున్నారు. ఈ నేపథ్యలో శరభవరం గ్రామానికి చెందిన జలుమూరి సత్తిబాబు అనే రైతు మానసిక వ్యధతో మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అదేవిధంగా రోలుగుంట నుంచి మాకవరపాలెంలో ఆన్‌రాక్‌ కంపెనీకి వచ్చే లోడ్‌ లారీలను స్థానికులు అడ్డుకున్నారు. డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోడ్లు దెబ్బతింటున్నాయి.

కూటమి నేతల అక్రమ వసూళ్లు

రోజుకు 1000 ట్రిప్‌లు..

అనకాపల్లి రూరల్‌ పరిధిలో మార్టూరు, మామిడపాలెం, మావవరం, బౌలువాడ, కుంచంగి, వేట జంగాలపాలెం, వెంకుపాలెం గ్రామాల నుంచి రాంబిల్లి మండలంలో నావెల్‌ బేస్‌ ప్రాజెక్టుకు బండరాళ్లు సరఫరా అవుతున్నాయి. అనకాపల్లి రూరల్‌ ప్రాంతంలో మాకవరం, మామిడిపాలెం, మార్టూరు గ్రామాల్లో, బౌలువాడ, కుంచంగి, వేటజంగాలపాలెం, వెంకుపాలెం గ్రామాల సమీపంలో ఉన్న క్వారీల నుంచి రవాణా చేస్తున్నారు. చోడవరం నియోజకవర్గంలో రోలుగుంట, రావికమతం, కాకినాడ జిల్లాలో రౌతులపూడి, కోటనందూరు మండలాల నుంచి క్వారీ లారీల్లో రవాణా జరుగుతున్నాయి. రోజుకు సుమారుగా 300 నుంచి 350 వరకూ క్వారీ లారీల ద్వారా 1000 ట్రిప్‌లు వెళుతున్నాయి. రోజుకు సుమారు 12,000 నుంచి 13,000 టన్నుల స్టోన్‌ రవాణా జరుగుతోంది.

మైనింగ్‌ పేరిట కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు లక్షలు ఆర్జిస్తున్నారు. టన్నుకు రూ.30 చొప్పున నెలకు సగటున రూ.కోటి 8 లక్షల అక్రమ వసూళ్లు చేస్తున్నారు. అదేవిధంగా ట్రాన్స్‌పోర్టు పరంగా చూస్తే ఒక లారీ రోజుకు రెండు నుంచి మూడు ట్రిప్పులు వేస్తుంది. రెండు లోడ్లకు 80 టన్నులు, మూడు లోడ్లు అయితే 120 టన్నులు రవాణా జరుగుతుంది. ఒక టన్నుకు రూ.500 చొప్పున నెలకు రూ.12 లక్షలు వసూలు చేస్తారు. 300 నుంచి 350 లారీలకు రూ.36 కోట్ల నుంచి రూ.40 కోట్లు వసూలవువుతాయి. కూటమి ప్రజాప్రతినిధులైన స్థానిక ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేలు ఈ దందా నడిపిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అందుకే అధిక లోడ్‌తో రవాణా చేసినా .. ప్రమాదాలు జరిగినా అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు ఉండడం లేదు. అక్రమ మైనింగ్‌ దందాలన్నీ పార్లమెంట్‌ సభ్యుడు సీఎం రమేష్‌ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని, అనకాపల్లిలో రైల్వే బ్రిడ్జి ప్రమాదానికి ఆయనే బాధ్యత వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె.లోకనాథం నేతృత్వంలోని బృందం సభ్యులు సోమవారం విమర్శించిన విషయం తెలిసిందే.

క్వారీ లారీలు 1
1/4

క్వారీ లారీలు

క్వారీ లారీలు 2
2/4

క్వారీ లారీలు

క్వారీ లారీలు 3
3/4

క్వారీ లారీలు

క్వారీ లారీలు 4
4/4

క్వారీ లారీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement