
నర్సీపట్నంలో సభ జరగనున్న మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా కటౌట్లు
● మాకవరపాలెం నుంచి నర్సీపట్నం వరకు ర్యాలీ ● భీమబోయినపాలెంలో మెడికల్ కళాశాల పనుల పరిశీలన ● నర్సీపట్నం అబిద్ సెంటర్‌లో భారీ బహిరంగ సభ నేడు ● హాజరుకానున్న డిప్యూటీ సీఎంలు బూడి, రాజన్నదొర, మంత్రులు బొత్స, ధర్మాన, అమర్‌నాథ్
సాక్షి, అనకాపల్లి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో బడుగు వర్గాలకు జరిగిన మేలును వివరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక సాధికారక బస్సు యాత్ర శనివారం నర్సీపట్నం నియోజకవర్గంలో జరగనుంది. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి నేటి వరకు 55 నెలల పాలనలో జరిగిన సామాజిక న్యాయం, బడుగు, బలహీన వర్గాలకు అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం. జిల్లాలో మొదటి, రెండు విడతల్లో మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి, చోడవరం నియోజకవర్గాల్లో విజయవంతంగా సామాజిక బస్సుయాత్ర సాగింది. అంతకు రెట్టింపు ఉత్సాహంతో నర్సీపట్నంలో సామాజిక జైత్రయాత్రలా బస్సుయాత్ర జరగనుంది. ఈ యాత్రకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి పీడిక రాజన్నదొర, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్‌తోపాటు వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి హాజరుకానున్నారు. సామాజిక సాధికార బస్సు యాత్ర ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పరిశీలించారు.
నర్సీపట్నంలో సామాజిక న్యాయం
రాజకీయ, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యత కల్పించారు. బీసీ మహిళకు రెండేళ్ల పాటు డీసీసీబీ చైర్‌పర్సన్ పదవి అందించారు. ప్రస్తుతం సంచారక జాతుల డైరెక్టర్, శాలివాహన, కుమ్మరి, అయ్యరక కార్పొరేషన్ డైరెక్టర్, పామాయిల్ కార్పొరేషన్ డైరెక్టర్, ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్, డీసీసీబీ డైరెక్టర్, మార్కెట్ కమిటీ చైర్మన్ తదితర నామినేటెడ్ పదవులను బీసీలకు, ఒక ముస్లింకు కేటాయించారు. రాజకీయ పదవుల్లో ప్రధానంగా ఎస్సీలకు మున్సిపల్ చైర్‌పర్సన్, గొలుగొండ ఎంపీపీ, నాతవరం జెడ్పీటీసీ, ఎస్టీకి నాతవరం ఎంపీపీ, బీసీలకు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి, నర్సీపట్నం, మాకవరపుపాలెం ఎంపీపీ పదవులు, గొలుగొండ జెడ్పీటీసీ, మాకవరపాలెం జెడ్పీటీసీ, 8 వైస్ ఎంపీపీ పదవులు కల్పించారు.
వైఎస్సార్‌సీపీ జెండాల రెపరెపలు
సామాజిక సాధికార బస్సు యాత్రతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. నర్సీపట్నం, మాకవరపాలెం మండలాల్లో వైఎస్సార్‌సీపీ జెండాలు శుక్రవారం మధ్యాహ్నం నుంచే రెపరెపలాడుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున జెండాలు, కటౌట్లను ఏర్పాటు చేశారు.
రూ.2,700 కోట్లతో సంక్షేమాభివృద్ధి
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక 55 నెలల పాలనలో నర్సీపట్నం నియోజకవర్గంలో రూ.2,700 కోట్లతో సంక్షేమాభివృద్ధి జరిగింది. ఎన్నడూ లేనివిధంగా మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతోంది. నియోజకవర్గంలో లబ్ధి పొందిన కుటుంబాలన్నీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలననే మళ్లీ కోరుకుంటున్నాయి. స్కూలు విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు అందరూ జగనన్న ప్రభుత్వంలో లబ్ధి పొందినవారే. నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలంతా సామాజిక సాధికార యాత్రను విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
– పెట్ల ఉమాశంకర్ గణేష్, నర్సీపట్నం ఎమ్మెల్యే
బస్సు యాత్ర సాగనుందిలా..
ఉదయం 11 గంటలకు మాకవరపాలెంలో సామాజిక సాధికార యాత్ర ప్రారంభం కానుంది. అక్కడ నుంచి బైక్, కార్లతో ర్యాలీగా బయలుదేరి భీమబోయినపాలెంలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల వద్దకు వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డితో పాటు మంత్రులు చేరుకుంటారు
వైద్య కళాశాల నిర్మాణాన్ని పరిశీలించిన అనంతరం మంత్రులు భీమబోయినపాలెంలో ప్రెస్‌మీట్ నిర్వహిస్తారు.
ప్రెస్‌మీట్ అనంతరం అక్కడ నుంచి దాదాపు 12 కిలోమీటర్ల వరకు బస్సుయాత్ర సాగుతుంది.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లంచ్ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నర్సీపట్నం అబిద్ సెంటర్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో మంత్రులు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ సభ జరుగుతుంది.
ఏర్పాట్ల పరిశీలన
నర్సీపట్నం: సామాజిక సాధికార బస్సుయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పిలుపునిచ్చారు. అబిద్‌సెంటర్‌లో వేదిక ఏర్పాట్లను ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుల బొడ్డేడ ప్రసాద్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సుయాత్ర మాకవరపాలెం మండలం శెట్టిపాలెం వద్ద ప్రారంభమవుతుందని, వెయ్యి బైకులతో బస్సుయాత్రకు స్వాగతం పలుకుతున్నామన్నారు.


మాకవరపాలెంలో ఏర్పాటు చేస్తున్న కటౌట్లు
