గంజాయి మిస్టరీని ఛేదించిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

గంజాయి మిస్టరీని ఛేదించిన పోలీసులు

Dec 30 2023 1:58 AM | Updated on Dec 30 2023 1:58 AM

సోమన్నపాలెంలో గంజాయి బ్యాగు లభించిన ప్రాంతంలో విచారణ చేస్తున్న పోలీసులు (ఫైల్‌) - Sakshi

సోమన్నపాలెంలో గంజాయి బ్యాగు లభించిన ప్రాంతంలో విచారణ చేస్తున్న పోలీసులు (ఫైల్‌)

● ఠాణాలో గంజాయిని కాజేసిన వైనం ● 6 నెలల కిందట నుంచి పథకం ● ఎట్టకేలకు పట్టుబడిన నిందితులు ● 8 మంది అరెస్ట్‌, రిమాండ్‌కు తరలింపు

యలమంచిలి/యలమంచిలి రూరల్‌: పలు కేసుల్లో పట్టుబడ్డ గంజాయిని పోలీసుల కన్నుగప్పి మాయం చేశారు. ఇతర ప్రాంతాల్లో దీన్ని విక్రయించడానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పడిపోయిన బ్యాగు ఆధారంగా గంజాయి ముఠాను యలమంచిలి రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు తెలుసుకుని నిర్ఘాంతపోయారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్‌ చేసినట్టు సీఐ గఫూర్‌ శుక్రవారం రాత్రి తెలిపారు. వివరాలివి... కొన్ని కేసుల్లో అనుమానితులుగా ఉన్న కొందరు యువకులను యలమంచిలి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించిన క్రమంలో వారు స్టోర్‌ రూంలో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. పోలీస్‌ స్టేషన్‌ పక్కన, వెనుక భాగంలో నివాస గృహాలేవీ లేకపోవడంతో పట్టణానికి చెందిన ప్రగడ రవితేజ, దుర్గాసాయి, కార్తీక్‌ ఆర్నెల్ల కిందట గంజాయిని కాజేసేందుకు పథకం పన్నారు. ఈ మేరకు పట్టణానికి చెందిన రవితేజ, దుర్గాసాయి, కార్తీక్‌ రాత్రిళ్లు స్టేషన్‌ వెనుకవైపు స్టోర్‌ రూమ్‌ కిటికీ గ్రిల్స్‌ తొలగించి రెండు బస్తాల గంజాయిని పట్టుకుపోయారు. ఈ రెండు బస్తాలను నక్కపల్లికి చెందిన వెంకటేష్‌కు విక్రయించగా, అతను మరో ఇద్దరితో కలిసి విజయవాడలో విక్రయించేందుకు తరలిస్తుండగా ఆత్మకూరు పోలీసులకు పట్టుబడ్డారు. అక్కడ పోలీసులు ఆరా తీయగా, ఈ గంజాయిని తాము చింతపల్లి నుంచి కొనుగోలు చేసి తెస్తున్నట్టు చెప్పారు.

పట్టుబడింది ఇలా...

ఆ తర్వాత 15 రోజుల కిందట నిందితుడు రవితేజ తన సహచరులైన శీలంశెట్టి సాయి, పైరపు తేజ, గొర్లె కుసుమకుమార్‌, మరో ఇద్దరు మైనర్లతో కలిసి ఇటీవల అర్ధరాత్రి వేళ స్టేషన్‌ స్టోర్‌ రూమ్‌లో 8 గంజాయి బస్తాలను దొంగిలించారు. దీన్ని యలమంచిలి మండలం సోమన్నపాలెం రైల్వే అండర్‌ బ్రిడ్జి సమీపంలో పాడుబడిన భవనంలో దాచారు. ఈ నెల 26న వాటిలో ఒక గంజాయి బ్యాగును విక్రయించేందుకు సిద్ధపడ్డారు. రవితేజ మరో వ్యక్తితో కలిసి బైక్‌పై గంజాయి బ్యాగును తీసుకెళ్తుండగా, బ్యాగు కిందపడిపోవడంతో దాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. యలమంచిలి రూరల్‌ పోలీసులు ఆ గంజాయి బ్యాగును స్వాధీనపర్చుకుని ప్రత్యేక బృందాలతో కేసు దర్యాప్తు చేసి, సాక్ష్యాధారాలు సేకరించారు. ఈ కేసుల్లో రవితేజ, దుర్గాసాయి, కార్తీక్‌, శీలంశెట్టి సాయి, పైరపు తేజ, గుర్లె కసుమ కుమార్‌ సహా వెంకటేష్‌, గణేష్‌లను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 310 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించినట్టు సీఐ గఫూర్‌ చెప్పారు. నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో విశాఖ కేంద్ర కారాగారానికి తరలించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement