కొయ్యూరు: క్రీడాకారులు ఆటల్లో రాణించి విజయాలు సాధించాలని ఎస్‌ఐ కిషోర్ వర్మ అన్నారు. ఆయన గురువారం సేవా సంకల్ప్ అభియాన్ క్రీడా పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని విద్యార్థులకు సూచించారు. క్రీడలు దేశానికి, సొంత గ్రామానికి మంచి పేరు తెస్తాయని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియన్ క్రీడా పోటీల్లో భారతీయులు సాధిస్తున్న పతకాల వివరాలను ఆయన వివరించారు. ఈ పోటీల్లో ఆ మండలంలోని వివిధ ఉన్నత పాఠశాలలకు చెందిన 460 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా మొత్తం ఆరు రకాల పోటీలను నిర్వహించారు. ఇక్కడ విజయం సాధించిన వారికి ఈ నెల 3న నియోజకవర్గ స్థాయిలో బాలురకు పాడేరులో ఆటలు నిర్వహిస్తారు. అలాగే బాలికలకు ఈ నెల 9న పోటీలు ఉంటాయి. అనంతరం ఈ నెలలోనే జిల్లా స్థాయి పోటీలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం సీహెచ్ శ్రీనివాసరావు, వివిధ పాఠశాలలకు చెందిన పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.


