తుమ్మపాల : జిల్లాలో నమోదు కాని అన్ని ప్రైవేట్ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్లు 15 రోజుల్లోగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఆర్. అచ్యుత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్‌న్) చట్టం–2002 ప్రకారం ప్రైవేట్ వైద్య సంస్థల నమోదు తప్పనిసరి అని తెలిపారు. జిల్లాలో ఇంకా నమోదు కాని క్లినిక్‌లు, ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్, మెడికల్ ల్యాబొరేటరీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఫిజియోథెరపీ సెంటర్లు, పాలీక్లినిక్లు, డెంటల్ క్లినిక్లు, డెంటల్ ఆసుపత్రులు వైద్య సంస్థలు వెంటనే నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. నమోదు లేకుండా వైద్య సంస్థలను నిర్వహించడం చట్ట నిబంధనలకు విరుద్ధమని ఆమె స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు నిర్దేశిత చట్టపరమైన ప్రమాణాలను పాటించడం ప్రతి క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ బాధ్యత అని పేర్కొన్నారు. నమోదు కాని సంస్థల నిర్వాహకులు ఎటువంటి ఆలస్యం చేయకుండా సంబంధిత అధికారులను సంప్రదించి 15 రోజుల్లోగా నమోదు చేసుకోవాలని కోరారు. గడువులోగా నమోదు చేసుకోని సంస్థలపై చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ హెచ్చరించారు.


