అరకు టూ పారిస్‌.. | - | Sakshi
Sakshi News home page

అరకు టూ పారిస్‌..

Oct 1 2026 4:28 AM | Updated on Oct 1 2026 4:28 AM

ఉదయాన్నే వేడివేడి కాఫీ గుబాళింపు.. అందులోనూ అరకు మన్యం అందించే సహజమైన పరిమళం ఇస్తే ఆ అనుభూతే వేరు! ప్రపంచంలో ఎన్నో రకాల కాఫీలు ఉన్నప్పటికీ, మన తెలుగు నేలలో, గిరిజనుల చెమటోడ్చిన కష్టంతో పండుతున్న ’అరకు కాఫీ’ రుచి, సువాసనే ఎప్పటికీ ప్రత్యేకమే. కేవలం ఒక పానీయంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో విశ్వఖ్యాతి గడించిన మన్యం కాఫీ ప్రస్థానం, దాని వెనుక గిరి రైతుల శ్రమ ఎంతో ఉంది. నేడు ప్రపంచ కాఫీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం

సాక్షి, పాడేరు: ఒకప్పుడు కొండపోడు వ్యవసాయంతో అడవులను నరికి జీవనం సాగించిన గిరిజనులు, నేడు నేల స్వభావాన్ని మార్చి ప్రపంచానికి అరుదైన రుచిని అందిస్తున్నారు. మన్యమంతా కాఫీ తోటల ఘుమఘుమలతో విలసిల్లుతుండగా.. ఆ వెనుక గిరిజన రైతుల అష్టకష్టాలు, చెమటోడ్చిన శ్రమే అసలు సిసలుగా నిలిచింది. నేడు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ’అరకు కాఫీ’ వెనుక ఉన్న సుదీర్ఘ ప్రయాణం గిరిజన రైతుల ఆర్థిక స్థితిగతులనే పూర్తిగా మార్చేసింది.

సాగు ప్రస్థానమిలా..

గిరిజనుల్లో మార్పు, ఆర్థికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర కాఫీ బోర్డు 1950లో ఆర్‌వీనగర్‌ పరిశోధన స్థానం ద్వారా కేవలం 50 ఎకరాలతో అరకు ప్రాంతంలో కాఫీ సాగును ప్రోత్సహించింది. కాలక్రమేణా ఏజెన్సీ అంతటా కాఫీ తోటల విస్తరణ జోరందుకుంది. ప్రస్తుతం జిల్లాలోని 11 మండలాల్లో ఏకంగా లక్షా 3 వేల 991 హెక్టార్లలో గిరిజనులే స్వయంగా కాఫీ తోటలను సాగు చేస్తున్నారు.

● గత ఏడాది 91,500 హెక్టార్లలో కాఫీ ఫలసాయాన్ని సేకరించిన గిరిజన రైతులు, ఏకంగా 15,276 మెట్రిక్‌ టన్నుల కాఫీ గింజలను ఉత్పత్తి చేసి అమ్మకాలు జరిపారు. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 2 లక్షల 45 వేల 842 మంది గిరిజన కుటుంబాలు కాఫీ పంటపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. ఎకరానికి సుమారు రూ. లక్ష వరకు ఆదాయం వస్తుండటంతో గిరిజన రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.

పూర్తిగా ఆర్గానిక్‌..

అరకు కాఫీ గింజలు నాణ్యతలో నెంబర్‌ వన్‌గా నిలుస్తున్నాయి. ఎలాంటి రసాయనాలు కలపకుండా పూర్తిగా ఆర్గానిక్‌ పద్ధతిలో గిరిజన రైతులు పండిస్తున్న ఈ కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. బెంగళూరు కాఫీ మార్కెట్‌లో విదేశీ సంస్థలు సైతం మన్యం కాఫీ గింజలను అధికంగా కొనుగోలు చేస్తున్నాయి. భారత పార్లమెంట్‌లోనూ ప్రత్యేకంగా అరకు కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేయడం విశేషం. పర్యాటక ప్రాంతమైన అరకులోయలో ప్రత్యేకంగా కాఫీ మ్యూజియం, షాపులను ఏర్పాటు చేసి ఈ రుచులను పర్యాటకులకు అందిస్తున్నారు.

నిర్దిష్ట ధరలు లేక రైతుల ఇబ్బందులు

పంట సేకరణ, మార్కెటింగ్‌, నాణ్యమైన గింజల ఉత్పత్తి కోసం గిరిజన రైతులు పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదు. అయితే, మార్కెట్‌లో ఇంకా సరైన, నిర్దిష్టమైన ధరలు లభించకపోవడంతో రైతులకు రావాల్సిన లాభాలు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వం లేదా కాఫీ బోర్డు ప్రత్యేక చొరవ తీసుకుని మన్యం కాఫీకి సరైన గిట్టుబాటు ధర కల్పించి, మార్కెటింగ్‌ వసతులు మెరుగుపరిస్తే గిరి రైతుల కష్టానికి మరింత సముచిత ప్రతిఫలం దక్కనుంది.

ఉదయాన్నే వేడివేడి కాఫీ కప్పు చేతిలో పడగానే ఆ సువాసన చూస్తే చాలు.. సగం అలసట ఆవిరైపోతుందని కాఫీ ప్రేమికులు తరచూ చెబుతుంటారు. నిజానికి మాది కూడా అదే అభిప్రాయం. జీవితంలో ఎన్నో రకాల కాఫీలను టేస్ట్‌ చేశాం కానీ, అరకు లోయ నుంచి తెప్పించుకున్న ఆ ఆర్గానిక్‌ కాఫీని మొదటిసారి సిప్‌ చేసిన క్షణం మాత్రం మాకిప్పటికీ గుర్తే! ఆ అనుభూతిని మాటల్లో చెప్పడం కంటే, ఒక కాఫీ ప్రియుడిగా ఆస్వాదిస్తేనే దాని అసలు మజా ఏమిటో తెలుస్తుంది.

ఆ మొదటి సిప్‌లో అనిపించింది ఇదే...

సాధారణంగా మనం తాగే కాఫీల్లో మంచి స్ట్రాంగ్‌ డికాషన్‌, లేదా ఒక్కోసారి పదునైన చేదు ఉంటుంది. కానీ అరకు కాఫీ అలా కాదు. వేడినీళ్లలో ఆ కాఫీ పొడిని కలపగానే గది అంతా గుబాళించిన ఆ సువాసనే కట్టేసింది. మొదటి గుటక వేయగానే.. నోట్లో తేలికపాటి చాక్లెట్‌ ఫ్లేవర్‌, అలా తగిలి తగలని రోస్టెడ్‌ నట్స్‌ సుగంధం మనసును హత్తుకున్నాయి. మరీ ఎక్కువగా చేదుగా కాకుండా, అత్యంత మృదువైన టేస్ట్‌తో గొంతులోకి దిగుతుంటే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేం!. ఈరోజు బెంగళూరు మార్కెట్ల నుంచి విదేశీ సంస్థల వరకు, పార్లమెంట్‌ స్టాళ్ల నుంచి పారిస్‌ వీధుల వరకు ’అరకు కాఫీ’ పేరు మారుమోగుతుందంటే దానికి కారణం ఆ గిరి బిడ్డల శ్రమే. అందుకే రోజూవారీ హడావుడిలో పడి ఉదయం కాఫీని ఏదోలా తాగేయడం కంటే.. అరకు కాఫీని ఒక కప్పులో పోసుకుని, దాని గుబాళింపు ఆస్వాదిస్తూ ఒక్కో సిప్‌ చేస్తుంటే.. అరకు లోయలోని ఆ పచ్చని కాఫీ తోటల్లో తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. మన్యం గిరిజనుల చెమటోడ్చిన కష్టానికి దక్కుతున్న ఈ విశ్వఖ్యాతి చూస్తుంటే ప్రతి తెలుగువాడు గర్వించాల్సిందేనని కాఫీ ప్రేమికులు చెబుతుంటారు.

కాఫీ ప్రేమికుల

మనసు దోచిన మన్యం రుచి!

నేడు ప్రపంచకాఫీ దినోత్సవం

మన్యం కాఫీకి విశ్వఖ్యాతి!

50 ఎకరాల నుంచి లక్షా పైచిలుకు హెక్టార్లకు విస్తరించిన ప్రస్థానం!

రసాయనాలు లేని ఆర్గానిక్‌ స్వచ్ఛతేఅసలు రహస్యం

గిరిజన రైతుల చెమటోడ్చిన కష్టానికి దక్కిన అరుదైన ప్రతిఫలం

ఉదయాన్నే ఒక సిప్‌ చేస్తే చాలు..అరకులోని పచ్చని తోటల్లో తిరుగుతున్న అనుభూతి!

మార్కెటింగ్‌ కల్పించాలి

అరకు కాఫీ బ్రాండ్‌తో మన్యం కాఫీకి ప్రపంచవ్యాప్తంగా విశ్వఖ్యాతి వచ్చింది. దానికి తగ్గట్టుగానే మాకూ గిట్టుబాటు ధరలతో కూడిన మెరుగైన మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలి. బెంగళూరు మార్కెట్‌ ధరలకు అనుగుణంగా వ్యాపారులు కాఫీ గింజలను కొనుగోలు చేయకపోవడంతో రైతులు పూర్తిస్థాయిలో లాభాలు పొందలేకపోతున్నారు. కాఫీ సాగుతో ఎంతో కొంత ఆదాయం వస్తున్నప్పటికీ, మరింత లాభాలు వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మాకు పూర్తి న్యాయం చేయాలి.

– పాలికి లక్కు, జిల్లా అధ్యక్షుడు,

కాఫీరైతుల సంక్షేమ సంఘం, పాడేరు

కాఫీతోటల విస్తరణ లక్ష్యం

ఏజెన్సీలో కాఫీ తోటలను మరింత విస్తరించే లక్ష్యంతో కేంద్ర కాఫీ బోర్డు ప్రతి ఏటా నిరంతరం కృషి చేస్తోంది. ఉపాధి హామీ పథకం ద్వారా కాఫీ తోటల విస్తరణకు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం. రైతులకు ఉచితంగా సిల్వర్‌ఓక్‌, కాఫీ మొక్కలను పంపిణీ చేస్తుండడంతో గిరిజన రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. ఈ కాఫీ పంట ద్వారా రైతులకు మంచి ఆదాయం ఏర్పడుతుంది. అంతేకాకుండా, నాణ్యమైన కాఫీ గింజల ఉత్పత్తి కోసం రైతులకు ప్రత్యేక శిక్షణనిస్తూ.. మరోవైపు సిమెంట్‌ కల్లాలను కూడా నిర్మించి ఇస్తున్నాం.

– మురళీధర్‌, డిప్యూటీ డైరెక్టర్‌,

కేంద్ర కాఫీబోర్డు, పాడేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement