● ఎస్పీ అమిత్ బర్దర్
సాక్షి, పాడేరు: జిల్లాలో ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంతో పాటు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నామని ఎస్పీ అమిత్ బర్ధర్ తెలిపారు. బుధవారం పాడేరులో ఆపరేషన్ త్రిశూల్‌పై అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం పాతబస్టాండ్ వద్ద పోలీసు సిబ్బంది, స్థానికులతో కలిసి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అమిత్ బర్దర్ విలేకరులతో మాట్లాడుతూ.. మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటివరకు సాధించిన ప్రగతి మరియు కేసుల వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 81 ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేసి, 10,625 కిలోల గంజాయిని, 42.9 కిలోల హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసు సంబంధిత నేరాల్లో మొత్తం 346 మంది నిందితులు ఉండగా, అందులో జిల్లాకు చెందిన వారు 136 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలకు సంబంధించి 32 కేసులు, 4 పోక్సో కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.జిల్లాలో 103 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని, అలాగే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యల్లో భాగంగా రూ. 18,395 చలానాలను విధించినట్లు ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని త్రిశూల్ నినాదాలతో అవగాహన కల్పించారు.


