చింతపల్లి: రైతులకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండే పంటల సాగుపై తగిన సూచనలు, సలహాలు అందించాలని స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఆదిలక్ష్మి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి సెప్టెంబర్ నెలకు సంబంధించి నెలవారీ శిక్షణ, పరిశీలనపై మాసిక వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, పంటల స్థితిగతులపై అధికారులతో ఆమె సమీక్షించారు. రానున్న రబీ సీజన్‌లో జిల్లాలో శెనగ, కుసుమ, మినుము వంటి అపరాలు పంటలను ప్రోత్సహించే విధంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి నందు సమావేశంలో వివరించారు. ఏడీఏ తిరుమలరావు, శాస్త్రవేత్తలు సందీప్‌నాయక్, బాలహుస్సేన్‌రెడ్డి, జోగారావు, వెంకటేష్ పాల్గొన్నారు.


