కలెక్టర్ నిశాంతి
సాక్షి, పాడేరు: బాలల హక్కుల పరిరక్షణతో పాటు వారి భద్రత, సంక్షేమం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ టి. నిశాంతి పిలుపునిచ్చారు. విద్యా, సీ్త్ర శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్థానిక శంకరన్ హాల్‌లో బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన ప్రతిభావంతులైన బాలికలకు కలెక్టర్ ఘనంగా బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిశాంతి మాట్లాడుతూ... బాలల హక్కులకు సంబంధించిన అన్ని అంశాలపై అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి, రక్షణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. బాలల హక్కులను పరిరక్షించడం కేవలం ప్రభుత్వ బాధ్యతే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. చిన్నారులకు పౌష్టికాహారం, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం , భద్రత కల్పించడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని తెలిపారు. ముఖ్యంగా పాఠశాలల్లో బాలబాలికలు ఎలాంటి ఒత్తిడి లేకుండా చదువుకోవడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో భానుమూర్తిరాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


