డుంబ్రిగుడ: ప్రభుత్వ భూముల అక్రమణలను అరికట్టడంలో రెవెన్యూ శాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి. సూర్యనారాయణ మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అరకు పంచాయతీ కేంద్రంలోని సర్వే నంబర్ 54/3 పరిధిలో, నేరేడువలస పాఠశాల సమీపంలో సుమారు ఎకరా 16 సెంట్ల ప్రభుత్వ భూమి ఉందని రెవెన్యూ అధికారులే చెబుతున్నారని తెలిపారు. కానీ, ఇంతవరకు ఆ భూమి వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడం వెనుక రెవెన్యూ అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఈ నెల 19న జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన గుర్తుచేశారు. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు స్పందించి, అక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను పరిరక్షించి తక్షణమే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి పాంగి సత్యనారాయణ, పాంగి మోహన్‌దాసు, డొంబు తదితరులు పాల్గొన్నారు.
అధికారుల తీరుపై గిరిజన సంఘ ఆగ్రహం


