దేవరాపల్లి: గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు యువకులను దేవరాపల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన కిరుబహరన్ రామచంద్రన్, విజయసామ్ విశాఖపట్నం మీదుగా ఒడిశా చేరుకొని రూ. 7 వేలుకు 2కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. గంజాయి ని బ్యాగులో వేసుకొని ఒడిశా నుంచి అరకు, అనంతగిరి మీదుగా ప్రయాణించి దేవరాపల్లి మండలం కాశీపురం మీదుగా తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. సమ్మెదలో వాహనాలు అందుబాటులో లేక పోవడంతో నడుచుకుంటూ వస్తున్న వీరిని అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన ఇద్దరు యువకులు గంజాయి, మద్యం ఇతర వ్యసనాలకు బానిసై గంజాయి అక్రమ రవాణా చేసి సంపాదించాలనే నిర్ణయంతో ఇక్కడికి వచ్చినట్టు తమవిచారణలో వెల్లడైందన్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.


