ఆస్తి దక్కదనే అక్కసుతో హత్య.. | - | Sakshi
Sakshi News home page

ఆస్తి దక్కదనే అక్కసుతో హత్య..

Oct 1 2026 4:28 AM | Updated on Oct 1 2026 4:28 AM

రాజవొమ్మంగి: తనకు దక్కాల్సిన ఆస్తి మరొకరికి దక్కుతుందేమోనని ఓయువకుడిని అతి క్రూరంగా హత్య చేసిన సంఘటన రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డలో జరిగింది. సోమవారం జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగు చూసింది. ఈ మేరకు రంపచోడవరం డీఎస్పీ అష్రఫ్‌ అలీ బుధవారం రాత్రి రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశా రు. ఆయన కథనం ప్రకారం అనకాపల్లి జిల్లా, గొలుగొండ మండలం కృష్ణదేవిపేటకు చెందిన రాంబాబు, పార్వతి దంపతులు వరుసకు మేనల్లుడు అయిన వీరబాబు అనే యువకుడిని చేరదీసి పెంచుకొంటున్నారు. వీరబాబు ఆ కుటుంబంలో అన్నీతానై రాంబాబు, పార్వతిలను కన్న తల్లిదండ్రులుగా చూసుకుంటున్నాడు. కాగా అంతకు ముందు రాంబాబు, పార్వతి దంపతులు వట్టిగెడ్డ గ్రామానికి చెందిన పల్లి శ్రీనును కూడా దత్తత తీసుకున్నారు. తనను దత్తత తీసుకున్న రాంబాబు, పార్వతి తనను అలసత్వం చేస్తూ వీరబాబును బాగా చూసుకుంటున్నారని, భవిష్యత్తులో వారికి చెందిన రూ.కోట్ల ఆస్తి కూడా వీరబాబుకే రాసేస్తారనే శ్రీను అక్కసు పెంచుకున్నాడు. వీరబాబును హత్య చేసేందుకు పల్లి శ్రీను కుట్ర పన్నాడు. ఈ క్రమంలో వీరబాబును సరదాగా వట్టిగెడ్డ తీసుకువచ్చి అక్కడ పొలాల్లో అతి కిరాతకంగా హతమార్చి గొయ్యి తీసి పాతిపెట్టాడు. అప్పటికే వీరబాబుపై కృష్ణదేవిపేటలో మిస్సింగ్‌ కేసు నమోదు కావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. రాంబాబు, పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇది పల్లి శ్రీను పనేనని పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో అసలు విషయం బయటకు వచ్చింది. ఘటనా ప్రాంతంలో డీఎస్పీ అష్రఫ్‌ అలీ పరిశీలించి, అక్కడ రక్తపు మరకలు, వీరబాబును పాతిపెట్టిన చోట ఆనవాళ్లను నిర్ధారించారు. చీకటి పడడంతో ఫోరెన్సిక్‌ నిపుణులను రప్పించి గురువారం కేసు మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ హత్యలో శ్రీనుకు వట్టిగెడ్డకు చెందిన మరో ఇద్దరు సహకరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. విలేకరుల సమావేశంలో సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement