చీడిగుమ్మలలో నిలిచిన ఎన్నిక
గొలుగొండ: అధికార బలంతో కూటమి నేతలు పెట్రేగిపోయారని, బడి అని మరిచి బరితెగించారని, ఒత్తిడి తెచ్చి చీడిగుమ్మల హైస్కూల్‌లో ఎస్‌ఎంసీ ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారికి పోలీసులు కూడా వంతపాడారని, గెలవలేకే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని మండిపడుతున్నారు. ఈ హైస్కూల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. డైరెక్టర్ల ఎన్నికల్లో మొదటి నాలుగు స్థానాలు వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకోవడంతో కంగుతిన్న కూటమి నాయకులకు ఏం చేయాలో తెలియక అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు గొడవలు సృష్టించి, కుర్చీలు, బల్లలు విసిరి నానా రాద్ధాంతం చేయడంతో ఎన్నికలు నిలుపుదల చేశారని స్థానికులు చెబుతున్నారు. నర్సీపట్నం, గొలుగొండ నుంచి వచ్చిన పోలీసులు సైతం అధికార పార్టీకి కొమ్ముకాసి భయభ్రాంతులకు గురిచేశారని పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగవలసిన చోట రచ్చ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.
ఎన్నికలు ఎప్పుడు పెట్టినా గెలిచి తీరుతాం
చీడిగుమ్మల హైస్కూల్ విద్యాకమిటీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా వైఎస్సార్‌సీపీ గెలిచి తీరు తుందని మాజీ జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు తెలిపారు. అధికార పార్టీ నాయకులు అడ్డుగోలుగా గొడవలు సృష్టించి, పోలీసులతో బలవంతంగా ఎన్నికలు నిలుపుదల చేశారని ఆయన ఆరోపించారు.


