● ఉధృతంగా ప్రవాహం
● కష్టతరంగా పెదలంక కొత్తూరుకురాకపోకలు
కొయ్యూరు: మండలంలోని ఎం.భీమవరం పంచాయతీ పరిధిలోని పెదలంక కొత్తూరు వద్ద గెడ్డకు వరద ఉధృతి తగ్గకపోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రానికి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదలంక కొత్తూరుకు చేరుకోవాలంటే దీనిని దాటాల్సి ఉంటుంది. అయితే, ఇటీవల కురిసిన వర్షాలకు దీని వరద ఉదృతి తగ్గకపోవడంతో ప్రధాన దారులన్నీ మూసుకుపోయాయి. దీంతో గ్రామస్తులు, ప్రయాణికులు సుమారు పది కిలోమీటర్లు అదనంగా నడచి, కాలువలో లోతు తక్కువగా ఉన్న ప్రత్యామ్నాయ మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. మంగళవారం ఆ గ్రామంలో ఎస్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు వెళ్లిన ఉపాధ్యాయులు సైతం ఈ వరద ఉధృతి కారణంగా తీవ్ర అవస్థలు పడ్డారు. మండల కేంద్రానికి రావాలన్నా, ఇతరులు గ్రామానికి వెళ్లాలన్నా కాలువల ఉధృతి వల్ల నిత్యం నానా తంటాలు పడాల్సి వస్తోందని, అధికారులు స్పందించి తమ రాకపోకలకు శాశ్వత పరిష్కార మార్గం చూపాలని స్థానికులు కోరుతున్నారు.


