నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే పాడేరు ఘాట్ రోడ్డులో ఏళ్లనాటి భారీ చెట్లు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. గాలివానొస్తే చాలు చెట్లు నేలకూలి గంటల తరబడి రాకపోకలు స్తంభిస్తున్నా.. అటవీశాఖ అధికారుల్లో మాత్రం చలనం కరువైంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని వాహనచోదకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
గాలివానొస్తే
సాక్షి, పాడేరు: పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు ప్రయాణించాలన్నా, విశాఖకు వెళ్లాలన్నా పాడేరు ఘాట్ రోడ్డు ఒక్కటే ప్రధాన మార్గం. నిత్యం వందలాది వాహనాలతో పాటు, ఇటీవల ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా భారీ సరకు వాహనాలు ఇదే మార్గం గుండా రాకపోకలు సాగిస్తుండటంతో ఈ ఘాట్ రోడ్డు రవాణా పరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, కేవలం 25 కిలోమీటర్ల పొడవుండే ఈ ఘాట్ రోడ్డులో గాలివాన వస్తే మాత్రం వాహనచోదకులు, ప్రయాణికులు భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
చెట్లు కూలితే నరకమే..
పాడేరు ఘాట్‌లో గాలివానల సమయంలో చెట్లు రోడ్డుకు అడ్డంగా కూలుతున్న ఘటనలు సర్వసాధారణంగా మారాయి. ఈ ఒక్క ఏడాదిలోనే ఘాట్‌లో నాలుగు చోట్ల భారీ వృక్షాలు నేలకూలడంతో గంటల తరబడి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇటీవల డైమండ్ పార్కు వద్ద ఉదయం కూలిన చెట్టు కారణంగా 2 గంటల పాటు, ఏనుగురాయి సమీపంలో రాత్రి సమయంలో కూలిన చెట్టు కారణంగా 3 గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు చీకట్లో, గంటల తరబడి వాహనాల్లోనే బిక్కుబిక్కుమంటూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కూలేందుకు సిద్ధంగా భారీ వృక్షాలు
ఘాట్‌రోడ్డులోని పోతురాజుస్వామి గుడి నుంచి వంట్లమామిడి సమీపం వరకు రోడ్డుకు ఇరువైపులా అనేక ఏళ్లనాటి భారీ వృక్షాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. రోడ్డుకు సమీపంలోనే వేర్లు బయటకు తేలి మరింత ప్రమాదకరంగా దర్శనమిస్తున్నప్పటికీ, వాటిని తొలగించే చర్యలు కరువయ్యాయి. ఏ క్షణాన ఏ చెట్టు మీదపడుతుందోనని వర్షాకాలంలో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు.
అటవీశాఖ అనుమతులు నిల్
మూడేళ్ల క్రితం అప్పట్లో రోడ్డుకు ఇరువైపులా ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించాలని రోడ్లు భవనాల శాఖ అధికారులు అటవీశాఖకు ప్రతిపాదనలు పంపినా ఎటువంటి అనుమతులు రాలేదు. గాలివానకు చెట్లు కూలిపోయిన తర్వాత వాటిని నరికి అటవీశాఖకు అప్పగించడం ఆనవాయితీగా మారిందే తప్ప, ప్రయాణికుల భద్రతను మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రమాదకర చెట్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
భయంభయంగా ప్రయాణం
ఘాట్‌లో అనేక చోట్ల కూలడానికి సిద్ధంగా ఉన్న చెట్లు భయపెడుతున్నాయి. భారీ వర్షాలు, గాలుల సమయంలో భయపడుతూనే వాహనాలు నడుపుతున్నాం. చెట్లు కూలితే వాటిని తొలగించే వరకు ఇరువైపులా గంటల తరబడి వాహనాలు నిలిచిపోయే పరిస్థితితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అటవీశాఖ, ఆర్‌అండ్‌బీ అధికారులు రోడ్డు పక్కన కూలే దశలో ఉన్న చెట్లను తొలగించి ఘాట్‌లో ప్రయాణానికి భద్రత కల్పించాలి.
– పచ్చా మాణిక్యాలరావు, కారు డ్రైవర్, పాడేరు
పాడేరు ఘాట్‌లో మృత్యు భయం
కూలేందుకు సిద్ధంగా ఏళ్లనాటిభారీ వృక్షాలు
వర్షంపడినప్పుడల్లా చెట్లు కూలిస్తంభిస్తున్న రాకపోకలు
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం
మూడేళ్లుగా ముందుకు సాగనితొలగింపు ప్రతిపాదనలు
అటవీశాఖ నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు
తొలగింపు నిర్ణయంఅటవీశాఖదే
ఘాట్ మార్గంలో చెట్లు రోడ్డుకు అడ్డంగా కూలితే వాటిని నరికి తొలగించడం, ట్రాఫిక్ క్లియర్ చేయడం మాత్రమే ఆర్‌అండ్‌బీ శాఖ బాధ్యత. ప్రమాదకరంగా ఉన్న చెట్లను ముందస్తుగానే తొలగించే అధికారం మాకు లేదు. చెట్ల తొలగింపు నిర్ణయం పూర్తిగా అటవీశాఖదే.
– శ్రీనివాస్, ఇంచార్జి ఈఈ, ఆర్‌అండ్‌బీ, పాడేరు


