పిల్లల భవిష్యత్‌పై బాధ్యత అవసరం | - | Sakshi
Sakshi News home page

పిల్లల భవిష్యత్‌పై బాధ్యత అవసరం

Sep 30 2026 1:28 AM | Updated on Sep 30 2026 1:28 AM

● తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకుకలెక్టర్‌ నిశాంతి సూచన

● కలెక్టర్‌ నిశాంతి

సాక్షి,పాడేరు: పిల్లల చదువులు, వారి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులదే కీలక బాధ్యత అని కలెక్టర్‌ టి. నిశాంతి అన్నారు. పాడేరు పట్టణంలోని గుడివాడ ప్రాథమిక మోడల్‌ పాఠశాలలో మంగళవారం పాఠశాల అభివృద్ధి కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలను అత్యంత ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. కలెక్టర్‌ సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్లో.. పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా అన్నంరెడ్డి సావిత్రి, వైస్‌ చైర్మన్‌గా పాంగి కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఎంఈవో విశ్వనాథం నూతన కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎస్‌ఎంసీ కమిటీలన్నీ పాఠశాలల సమగ్ర అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పిల్లలను రోజూ బడులకు సక్రమంగా పంపడంతో పాటు, ఇళ్ల వద్ద కూడా వారి చదువులు, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తల్లిదండ్రులను కోరారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యనందించేందుకు ఉపాధ్యాయులు శ్రమించాలని, వారికి తల్లిదండ్రులు అన్ని విధాలా సహకరించాలని సూచించారు.

చిన్నారులతో మమేకమైన కలెక్టర్‌

ఈ పర్యటనలో భాగంగా కలెక్టర్‌ నిశాంతి పాఠశాలలోని చిన్నారులు, వారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా మాట్లాడి మమేకమయ్యారు. అంతేకాకుండా, విద్యార్థులతో పాటు స్వయంగా నేలపై కూర్చుని వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజన నాణ్యతను పరిశీలించడంతో పాటు చిన్నారులతో ముచ్చటించారు.ఈ కార్యక్రమంలో డీఈవో భానుమూర్తిరాజు, ఎంఈవోలు విశ్వనాథం, సరస్వతి, హెచ్‌ఎం రామ్మూర్తినాయుడు, సీఆర్‌పీ హిమబిందు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement