పెదబయలు: మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో చెడు వ్యసనాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో సస్పెండ్ చేసిన ఏడుగురు విద్యార్థులపై నెలరోజులు దాటినా సస్పెన్షన్ ఎత్తివేయకపోవడం విద్యా హక్కు చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు వెంగడ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన స్థానిక ఏకలవ్య పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నెల 13న రాత్రి పాఠశాలలో జరిగిన ఘటనపై 14న ఏడుగురు విద్యార్థులను ప్రిన్సిపాల్ నెల రోజుల పాటు సస్పెండ్ చేశారని తెలిపారు. అయితే, నేటికి 49 రోజులు కావస్తున్నా సస్పెన్షన్ కొనసాగిస్తుండటం సరికాదన్నారు. ఇళ్ల వద్దే ఉంచడం వల్ల విద్యార్థుల్లో పరివర్తన రాదని, బదులుగా పోలీసు శాఖకు సమాచారం అందించి ఈగల్ టీమ్ ద్వారా కౌన్సెలింగ్, పునరావాసం కల్పిస్తే వారి భవిష్యత్తును కాపాడటానికి అవకాశం ఉండేదన్నారు. నెలల తరబడి సస్పెన్షన్‌లో ఉంచితే విద్యార్థులు మరింత చెడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని, పాఠశాలలో చదువుకోవడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆదివాసీ ఉపాధ్యక్షులు నీలకంఠ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంపై పాఠశాల హెచ్‌ఎం సుమిత్ కుమార్ ఆనంద్‌ను వివరణ కోరగా.. విద్యార్థులకు నెల రోజుల పాటు సస్పెండ్ చేయడం వాస్తవమేనని తెలిపారు. అయితే విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ నెల 21 నుంచి 29 వరకు జరిగిన మిడ్‌టర్మ్ పరీక్షలను ఇంటి వద్ద నుంచే వచ్చి రాయడానికి అనుమతించామని చెప్పా రు. ప్రస్తుతం తాను పాఠశాల ఆడిట్ నిమిత్తం విజయవాడలో ఉన్నానని, తిరిగి వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
ఎత్తివేయాలని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వెంగడ జగన్ డిమాండ్


