● ఎంఈవో నంబరే బ్లాక్ చేసినవిద్యాలయ సిబ్బంది!
● బాలారం ఏకలవ్య గురుకులంలో జరగని ఎస్‌ఎంసీ ఎన్నికలు
● ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోని
ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు
● ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన మండల విద్యాశాఖాధికారి
కొయ్యూరు: మండలంలోని బాలారం ఏకలవ్య గురుకుల పాఠశాలలో పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నిక మంగళవారం నిర్వహించకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మండలంలో మొత్తం 153 పాఠశాలలు ఉండగా.. ఒక్క ఏకలవ్య గురుకుల పాఠశాల మినహా మిగిలిన అన్ని చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల ఏకగ్రీవం కాగా, మరికొన్ని చోట్ల పోటీ ద్వారా ఎస్‌ఎంసీ కమిటీలను ఎన్నుకున్నారు. అయితే బాలారం ఏకలవ్య పాఠశాలలో మాత్రం ఎన్నిక నిర్వహించలేదని ఎంఈవో సింహాచలం తెలిపారు. ఈ విషయంపై ఎంఈవో మాట్లాడుతూ.. అక్కడ ఎన్నిక జరపాలని తాను స్వయంగా ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చానని, ఆ తర్వాత మళ్లీ సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫోన్ పనిచేయలేదని వెల్లడించారు. అంతేకాకుండా, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన ఆయన తక్షణమే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


