● ఎమ్మెల్సీ కుంభా రవిబాబు
● కలెక్టర్‌కు లేఖ రాసినట్టు వెల్లడి
అరకులోయ టౌన్: జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో తుపాను బాధితులకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ టి. నిశాంతికు లేఖ రాసినట్టు ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారులు, వంతెనలు, నివాస గృహాలు, పంటల నష్టంపై సమగ్ర అంచనా వేయాలని లేఖలో కోరినట్టు ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయక చర్యలు అందించడంతోపాటు దెబ్బతిన్న రహదారులు, వంతెనలను యుద్ధప్రాతిపాదికన పునరుద్ధరించాలని కోరామన్నారు. పాడేరు, అరకులోయ, డుంబ్రిగుడ, గూడెంకొత్తవీధి, చింతపల్లి, ముంచంగిపుట్టు, పెదబయలు, అనంతగిరి, హుకుంపేట మండలాల్లో వాగులు పొంగి పొర్లడంతోపాటు కొండ చరియలు విరిగిపడటంతో రాకపోకలకు, మారు మూల ప్రాంతాలకు నిత్యావసర సరకులు, వైద్య సేవలు అందించడంలో తీవ్ర ఆటంకం కలుగుతుందన్నారు. ముంచంగిపట్టు మండలం దోడిపూట్ పంచాయతీ పరిధిలో వాగులు పొంగి పొర్లడంతో నిత్యావసర సరకులు తీసుకువెళ్లేందుకు గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖ లో పేర్కొన్నట్టు ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని, ఈ నష్టాలపై క్షేత్ర స్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మారుమూల గ్రామాలకు త్వరితగతిన రహదారులు పునరుద్ధరించి నిత్యావసర సరకులు, వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ను కోరినట్టు ఎమ్మెల్సీ వెల్లడించారు.


