● పట్టించుకోని అధికారులు
● జేసీ ఆదేశాలే బేఖాతరు
కె.కోటపాడు: మండలంలో మళ్లీ ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. నిత్యం యథేచ్ఛగా తరలిస్తున్నా.. రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరి స్తున్నారు. ఇసుక రవాణాను నియంత్రించి, వాల్టా చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే ఇసుక అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలో చౌడువాడ శారదానదితో పాటు పరీవాహక ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా రు. ఇసుక తరలింపుపై చౌడువాడ గ్రామానికి చెందిన నాయకులు ఆగస్టు 7న కె.కోటపాడులో నిర్వహించిన ‘ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు సందర్శనలు’ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్‌కు ఫిర్యాదు చేశారు. చౌడువాడ వద్ద శారదా నదీ పరీవాహక ప్రాంతాన్ని గతంలోనే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు బ్లాక్ జోన్‌గా ప్రకటించారు. శారదానది నుంచి నాలుగు ఇరిగేషన్ కాలువలకు నీరు వెళ్లాల్సి ఉంది. దీంతో పాటు చౌడువాడ గ్రామ ప్రజలకు తాగునీరు అందించేందుకు శారదానదిలో బోర్ల నిర్మాణం చేపట్టారు. దీంతో ఈ ప్రాంతాన్ని బ్లాక్‌జోన్‌గా అధికారులు గుర్తించి ఇసుక తవ్వకాలు జరపకూడదని హెచ్చరించారు. ఇదే విషయాన్ని నాయకులు జేసీకి వివరించారు. వెంటనే స్పందించిన జేసీ చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో తనిఖీ చేశారు. అనంతరం రెండు రోజుల పాటు ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపివేశారు. తరువాత అధికారులు పట్టించుకోకపోవడంతో మళ్లీ ఇసుకను తరలిస్తున్నారు. కొందరు చౌడువాడ నుంచి ఇతర మండలాలకు తరలిస్తుండగా, మరి కొందరు గ్రామ శివార్లులో పోగులుగా వేసి రాత్రి సమయాల్లో ఇసుకను లారీలపై తరలిస్తున్నారు. కూటమి నాయకుల అండదండలతోనే అక్రమ రవాణా జోరుగా సాగుతోందని స్థానికు ఆరోపిస్తున్నారు.
అడ్డుకట్టవేస్తాం
చౌడువాడ శారదానదీ పరీవాహక ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకుంటాం. ఇసుక తవ్వకాలపై ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. త్వరలోనే గ్రామస్తులతో సమావేశం నిర్వహిస్తాం. కమిటీ వేసి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేస్తాం.
– నాగరాజు, తహసీల్దార్, కె.కోటపాడు


