జి.మాడుగుల: మండలంలోని ప్రాథమిక పాఠశాలలను నెలకు కనీసం రెండుసార్లు సందర్శించి, పనితీరుపై నివేదికలు సమర్పించాలని విద్యా సంక్షేమ సహాయకుల((వెల్ఫేర్ అసిస్టెంట్లు))కు అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్(ఏటీడబ్ల్యూవో) నాగశిరీష ఆదేశించారు. మండలంలోని స్వర్ణ గ్రామంలో ఉన్న ఏటీడబ్ల్యూవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆమె మాట్లాడారు. పాఠశాలల పర్యవేక్షణ, విద్యార్థుల హాజరు, సంక్షేమ పథకాల అమలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, నోట్‌బుక్స్ పంపిణీ వంటి అంశాలపై సమీక్షించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, మెనూ ప్రకారం రాగి మాల్ట్, చిక్కీ, గుడ్లు విద్యార్థులకు సక్రమంగా అందుతున్నాయో? లేదో? తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులందరికీ నోట్‌బుక్స్ అందేలా చూడాలని ఆదేశించారు. 9, 10 తరగతుల విద్యార్థుల ఓటీఆర్ నమోదు ప్రక్రియ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలని, పాఠశాలలకు దూరంగా ఉన్న పిల్లలను గుర్తించి వెంటనే చేర్పించాలని చెప్పారు. అర్హులైన ప్రతి విద్యార్థికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమంపై నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండలానికి చెందిన 15 మంది విద్యా సంక్షేమ సహాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఏటీడబ్ల్యూవో నాగ శిరీష ఆదేశం


