కలెక్టర్ టి.నిశాంతి
సాక్షి, పాడేరు: క్రాఫ్ట్ 3డీ ప్రింటింగ్ శిక్షణలో ప్రతిభ కనబర్చిన మహిళా బృందాలకు కలెక్టర్ టి.నిశాంతి సోమవారం త్రీడీ ప్రింటర్లను పంపిణీ చేశారు. మొత్తం 64 మంది గిరిజన మహిళలు ఈ శిక్షణలో పాల్గొన్నారు. తయారు చేసిన క్రాఫ్ట్ ఉత్పత్తుల ఆధారంగా నిర్వహించిన గ్రేడింగ్‌లో డుంబ్రిగుడ మండల మహిళా బృందం తొలి స్థానం సాధించగా, పాడేరు మండల బృందం ద్వితీయ స్థానంలో నిలిచింది. విజేత బృందాలకు పారిశ్రామిక స్థాయి రెండు త్రీడీ ప్రింటర్లను ఉచితంగా అందజేసి కలెక్టర్ అభినందించారు. స్వయం ఉపాధిలో రాణించి ఆర్థికంగా ఎదగాలని మహిళలను ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ జయకృష్ణ, గాయత్రి విద్యాపరిషత్‌కు చెందిన ప్రాజెక్ట్ ప్రధాన పరిశోధకురాలు డాక్టర్ బి.కీర్తిప్రియ, తదితరులు పాల్గొన్నారు.


