మన మన్యం అందాల సోయగం | - | Sakshi
Sakshi News home page

మన మన్యం అందాల సోయగం

Sep 27 2026 1:10 AM | Updated on Sep 27 2026 1:10 AM

పచ్చని ప్రకృతి.. జలపాతాల హోరు

మేఘాల కొండలు అద్భుతం

నిత్యం ప్రకృతి ఒడిలో పర్యాటకుల పరవశం

ఏటా 20 లక్షల మంది సందర్శన

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

సాక్షి, పాడేరు: చుట్టూ పచ్చని కొండలు.. మంచుకొండలను తలపించే మేఘాలు.. ఉధృతంగా పారే జలపాతాల సోయగం.. ఇలా సహజసిద్ధ ప్రకృతి అందాలకు నిలయం అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతం. పర్యాటకులకు స్వర్గధామంగా మారింది. అనంతగిరి నుంచి సీలేరు వరకు విస్తరించిన ఈ ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలు ప్రతి ఏడాది లక్షలాది మంది సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడి అందాలకు మంత్రముగ్ధులవుతున్నారు.

మైమరిపించే వంజంగి హిల్స్‌

పాడేరు మండలంలోని వంజంగి హిల్స్‌ మేఘాల మధ్య కనిపించే సూర్యోదయంతో విశేష ఆదరణ పొందింది. అరకులోయలోని మాడగడ, చింతపల్లి మండలంలోని చెరువులవేనం, హుకుంపేటలోని సీతమ్మకొండ వంటి వ్యూపాయింట్లు పర్యాటకులను అలరిస్తున్నాయి. పొగమంచు కమ్ముకున్న ఈ ప్రాంతాల్లో సూర్యోదయం అందాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. అనంతగిరిలోని బొర్రాగుహలు, అరకులోయలో పద్మాపురం గార్డెన్‌, గిరిజన మ్యూజియం, లంబసింగి, సీలేరు వంటి ప్రాంతాలు పర్యాటకుల రద్దీతో నిత్యం కళకళలాడుతున్నాయి. జిల్లాలో ఏటా సుమారు 20 లక్షల మంది వరకు పర్యాటకులు సందర్శిస్తున్నట్లు అంచనా.

జలపాతాల హోరు

జిల్లా వ్యాప్తంగా జలపాతాల సోయగం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. పెదబయలు మండలంలోని తారాబు(పిట్టలబొర్ర), అనంతగిరిలోని కటికి, తాడిగుడ, డుంబ్రిగుడలో చాపరాయి, జి.మాడుగులలో కొత్తపల్లి, సీలేరు ప్రాంతంలోని ఐస్‌గెడ్డతో పాటు ఒడిశా సరిహద్దులోని మాచ్‌ఖండ్‌ జలపాతాలు సందర్శకులను మైమరపింపజేస్తున్నాయి. అక్టోబర్‌ నుంచి జనవరి వరకు విరబూసే పసుపుపచ్చని వలిసెపూల తోటలు భూమిపై పసుపు చీర పరచినట్టుగా కనిపిస్తూ పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి.

రూ.5 కోట్లతో తారాబు జలపాతం అభివృద్ధి

పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తారాబు జలపాతంలో రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. రహదారి, వ్యూపాయింట్లు, ఇతర సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. మిగిలిన పర్యాటక ప్రాంతాల అభివృద్ధికీ చర్యలు తీసుకుంటున్నాం.

– డాక్టర్‌ గుమ్మా తనూజరాణి, ఎంపీ, అరకులోయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement