సాక్షి, పాడేరు/అరకులోయ టౌన్(డుంబ్రిగుడ): జిల్లాలో వాయుగుండం ప్రభావంతో గిరిజన ప్రాంతాల్లో జనజీవనం తీవ్రంగా దెబ్బతిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. పాడేరు, అరకులోయ, డుంబ్రిగుడ, గుడెంకొత్తవీధి, చింతపల్లి, ముంచంగిపుట్టు, పెదబయలు, అనంతగిరి, హుకుంపేట తదితర ఏజెన్సీ మండలాల్లో అనేక గ్రామాలు వరదలు, కొండవాగుల ఉధృతితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు గ్రామాలకు చేరుకోలేని పరిస్థితులు నెలకొనడం ఆందోళనకరమన్నారు. ముంచంగిపుట్టు మండలంలోని దోడిపుట్టు పంచాయతీ పరిధిలో గెడ్డలు పొంగి పొర్లడంతో నిత్యావసర సరకుల కోసం ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి వాగులు దాటాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అనంతగిరి మండలం ఓనుగొండ, అరకులోయ పరిసర గ్రామాలు సహా వంతెనలు, రహదారులు లేని అనేక ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. భారీ వర్షాలకు గిరిజనుల నివాస గృహాలు దెబ్బతినడం, గోడలు కూలిపోవడం, ఇళ్లలోకి వరద నీరు చేరడంతో అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని, పంట పొలాల్లో నీరు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర నష్టపోయారని పేర్కొన్నారు. పంట నష్టం వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని కోరారు. మారుమూల గిరిజన గ్రామాలకు రవాణా, వైద్యం, నిత్యావసర సరకుల సరఫరా నిలిచిపోకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. నష్టపోయిన గిరిజన కుటుంబాలకు తగిన సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


