సాక్షి, విశాఖపట్నం: తమ హక్కులు, భవిష్యత్తు కోసం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మరోసారి ఉద్యమానికి సిద్ధమయ్యారు. రెండేళ్లుగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా పరిష్కారం లభించలేదని పేర్కొంటూ ఈ నెల 27న ‘చలో విజయవాడ’కు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. తీవ్ర వాయుగుండం నెపంతో ప్రభుత్వం అత్యవసర విధుల పేరుతో సర్క్యులర్ జారీ చేసి, ఉద్యోగులు జిల్లా కేంద్రాలు దాటకూడదని ఆంక్షలు విధించింది. సోషల్ మీడియాలో నిరసనలు నడిపిస్తున్నారనే కారణంతో శ్రీకాకుళం జిల్లా విలేజ్ సర్వేయర్ల రాష్ట్ర అధ్యక్షుడు బూరాడ మధుబాబును సస్పెండ్ చేసింది. ఈ చర్యలపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ‘వర్షాలు వస్తే మిగతా ఉద్యోగులకు లేని అత్యవసర నిబంధనలు మాకే ఎందుకు? బెదిరింపులకు భయపడేది లేదు, విజయవాడకు తరలివెళ్లి తీరతాం’ అని స్పష్టం చేశాయి. సచివాలయ ఉద్యోగులు ఈ నెల 6న విశాఖలో శాంతియుత నిరసనలు, రాస్తారోకో చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి తగిన స్పందన వచ్చేంతవరకు ఐక్యతతో పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక స్పష్టం చేసింది.


