● సమగ్ర విచారణ జరిపించాలి
● గిరిజన సమాఖ్య నేత రాధాకృష్ణ డిమాండ్
సాక్షి, పాడేరు: ఇటీవల జిల్లాలో నిర్వహించిన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల భర్తీలో భారీగా అక్రమాలు జరిగాయని, దీనిపై వెంటనే సమగ్ర విచారణ జరపాలని గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అంగన్‌వాడీ, ఆయా పోస్టులకు సంబంధించి గత నెల 16వ తేదీన పాడేరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఇంటర్వ్యూల ప్రక్రియ పూర్తిగా పారదర్శకత లేకుండా సాగిందని ఆరోపించారు. ఇంటర్వ్యూలకు పిలిచిన చాలామంది మహిళలను ఎలాంటి ప్రశ్నలు అడగకుండానే అధికారులు వెనక్కి పంపారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చారా.. లేక ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేశారా అనేదానిపై అధికారులు స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో పెద్దఎత్తున అవినీతి, అక్రమా లు జరిగాయని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులకే ఈ పోస్టుల్లో నియామకాలు చేపట్టాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


