గిరిజనులను మభ్యపెట్టే నిర్ణయాలు తగదు | - | Sakshi
Sakshi News home page

గిరిజనులను మభ్యపెట్టే నిర్ణయాలు తగదు

Jul 24 2026 1:21 AM | Updated on Jul 24 2026 1:21 AM

పాడేరు: రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను మభ్యపెట్టే నిర్ణయాలను వెంటనే మానుకోవాలని, గిరిజనులకు వందశాతం ఉద్యోగ రిజర్వేషన్లు ప్రకటించాలని, అలాగే 1/70 చట్టం పరిరక్షణకు సుప్రీంకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. అప్పలనర్స డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో వివిధ ఆదివాసీ, గిరిజన సంఘాల నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన సమస్యలపై పదేపదే సమీక్షలు జరపడమే తప్ప, వాటి అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మోసపూరిత ప్రకటనలతో గిరిజనులను మోసం చేస్తోందని, ఎలాంటి నిర్దిష్టమైన కార్యాచరణ లేకుండా కేవలం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ కారణంగా జీవో నంబర్‌ 3 వర్తించక రాష్ట్రంలో గిరిజనులు ఏకంగా 5 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

అనుకూల సంఘాలతో సమీక్ష సరికాదు

గతంలో ఐటీడీఏ వారీగా నిర్వహించాల్సిన సమీక్షలను పక్కనబెట్టి, ఇప్పుడు ప్రభుత్వ అనుకూల సంఘాలతో విజయవాడలో మంత్రి సంధ్యారాణి సమీక్షా సమావేశాలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇటీవల పాడేరు, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో ఆదివాసీలు తమ హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడంతోనే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని, అయితే ఇప్పుడు సమీక్షల పేరుతో ఆ ఉద్యమాన్ని నీరుగార్చే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. విజయవాడలోని గిరిజన గురుకులాల కార్యాలయం ఎదుట సుమారు 600 మంది గిరిజన గురుకుల ఉద్యోగులు నెల రోజులుగా ఆందోళన చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణికి కనీసం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. 1/70 చట్టం రద్దు కోరుతూ ఏకంగా 16 వేల మంది గిరిజనేతరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తే.. గిరిజన చట్టాలు, హక్కులను కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు ఇప్పటివరకు కనీసం ఒక కౌంటర్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేయకపోవడం తీవ్ర అన్యాయమన్నారు.

ఆందోళనలు మరింత ఉధృతం

ఈ నేపథ్యంలో పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరంలో శుక్రవారం పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదివాసీ గిరిజనులంతా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గిరిజనుల సమస్యలపై, ఆదివాసీ ఉద్యోగ రిజర్వేషన్లపై, 1/70 చట్టంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోతే భవిష్యత్‌లో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ, ఆదివాసీ మహిళా సంఘం నేత విమల, గిరిజన సంఘం నాయకుడు దాస్‌, ఆదివాసీ గొండ్వాన దండకారణ్య నాయకుడు రాజు, నిరుద్యోగుల సంఘం ప్రతినిధులు కేవీ కుమార్‌, భాను, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జీవన్‌, కార్యదర్శి కార్తీక్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, నాయకులు చిన్నారావు, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

నూరుశాతం రిజర్వేషన్లపై

ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

1/70 చట్టం పరిరక్షణకు సుప్రీంకోర్టులో ప్రభుత్వం కౌంటర్‌ అఫిడివిట్‌

దాఖలు చేయాలి

గిరిజన శాఖ మంత్రి సంద్యారాణిప్రకటనలో స్పష్టత కరువు

నేడు రంపచోడవరంలో సీఎంచంద్రబాబు పర్యటనను అడ్డుకుంటాం

ఆదివాసీ గిరిజన సంఘం జాతీయకార్యవర్గ సభ్యుడు అప్పలనర్స

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement