చింతపల్లి: గిరిజన రైతాంగం ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ, పూర్తిగా సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్ నందు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో వ్యవసాయ సంచాలకులు బీవీ తిరుమలరావు ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు కిసాన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలను 90 నుంచి 100 శాతం రాయితీపై, అలాగే యాంత్రీకరణ పరికరాలను 50 శాతం రాయితీపై పంపిణీ చేస్తోందని తెలిపారు. జిల్లాలో సుమారు 38,430 హెక్టార్లలో వరి సాగు చేస్తుండగా, ఇప్పటికే 20 శాతం నాట్లు పూర్తి అయ్యాయన్నారు. ఈ ప్రాంతంలో అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో నాట్ల పనులు వేగవంతం అవుతున్నాయని తెలిపారు. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రతిఒక్కరూ విధిగా పంట బీమా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం వల్ల రైతులు ప్య్రామ్నాయ పంటలపై ఎక్కువగా దృష్టి సారించాలన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా వాడుతున్న సాంప్రదాయ వరి విత్తనాలను కాకుండా, నూతన వరి వంగడాలను సాగు చేయాలని కోరారు. ప్రస్తుతం స్వల్పకాలిక రకాలైన ఎంటీయూ 1262, 1318, 1224, ఎంటీయూ 115 చంద్ర, ఎన్‌ఎల్‌ఆర్ 34443 వంటి రకాలను నాటుకోవాలని సలహా ఇచ్చారు. నాట్లు వేసే సమయం నుంచి కోత దశ వరకు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మ పీడీ చంద్రరావు, వ్యవసాయ అధికారులు మధుసూదనరావు, సురేష్, ప్రధాన శాస్త్రవేత్తలు బాలహుస్సేన్‌రెడ్డి, బయ్యపురెడ్డి, సందీప్‌నాయక్, చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి నందు


