సాక్షి, పాడేరు: స్థానిక అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన వాసవిమాత, సరస్వతిదేవి, లక్ష్మీదేవి అమ్మవార్ల విగ్రహాలకు ఈ నెల 24వ తేదీ శుక్రవారం శాకాంబరి అలంకరణ ఉత్సవం నేత్రపర్వంగా జరగనుంది. ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీతో పాటు వాసవి క్లబ్ పాడేరు హిల్స్, వనిత మోదమాంబ సంఘాలు మరియు భక్తులందరూ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలను పెద్ద ఎత్తున తెప్పించి, వాటితో అమ్మవార్ల విగ్రహాలను సర్వాంగసుందరంగా అలంకరించే పనుల్లో భక్తులు నిమగ్నమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే వాసవిమాత, సరస్వతిదేవి, లక్ష్మీదేవి అమ్మవార్లు శాకాంబరి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దివ్యదర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సుబ్బారావు తెలిపారు. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.


