ప్రజలతో మాట్లాడుతున్న సీఐ శ్రీనివాసరావు
కొయ్యూరు: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఓటీపీలు, నకిలీ క్యూఆర్ కోడ్‌ల పట్ల జాగ్రత్త వహించాలని సీఐ బి. శ్రీనివాసరావు సూచించారు. ఆయన ఎస్‌ఐ కిషోర్‌వర్మతో కలిసి శనివారం రాత్రి కాకరపాడు వై–జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. అలాగే, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులు సరైన రికార్డులు కలిగి ఉండాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. గూడ్స్ వాహనాలలో ప్రయాణికులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ట్రాఫిక్ నిబంధనలను గౌరవించడంతో పాటు, మహిళల పట్ల ఎవరూ దురుసుగా ప్రవర్తించరాదని, అసభ్యకర పదజాలం వాడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని సీఐ స్పష్టం చేశారు.


