వీఆర్పీపై సమగ్ర విచారణ జరపాలి | - | Sakshi
Sakshi News home page

వీఆర్పీపై సమగ్ర విచారణ జరపాలి

Jun 7 2026 3:45 AM | Updated on Jun 7 2026 3:45 AM

రోలుగుంట : కొమరవోలు అవలో జరుగుతున్న ఉపాధి పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని కూలీలు పది రోజుల క్రితం కలెక్టర్‌ విజయకృష్ణన్‌కు, పీడీకి, ఎంపీడీవోకు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవోకు ఫిర్యాదు చేశారు. దీనిలో పనుల కెళుతున్న ఉపాధి కూలీ నుంచి వారానికి రూ.100 చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. డబ్బులిచ్చిన వారికి వారానికి ఆరు రోజుల మస్తరు, ప్రభుత్వ ఇస్తున్న కూలీ వేతనం పూర్తిగా మంజూరు చేస్తున్నారని, లేకుంటే మూడు రోజులు, నాలుగు రోజులు మస్తర్లు వేస్తున్నారన్నారు. ఈ ఫిర్యాదుపై కలెక్టర్‌ ఆదేశించిన విచారణ మేరకు ఈ నెల 4న ఎంపీడీవో వి.ఎస్‌ నాగేశ్వరరావు, ఏపీవో ఈశ్వరరావు, ఏపీడీ పని ప్రదేశానికి వెళ్లి విచారణ జరిపారు. అయితే విచారణ తీరుపై బాధిత ఉపాధి కూలీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం మళ్లీ అధికారులు పని ప్రదేశానికి ఆలస్యంగా వచ్చి విచారణ చేపట్టారు. ఈ విచారణలో కొందరు తమ వద్ద వారానికి రూ.100 ఇవ్వాలని, డబ్బులు ఇవ్వకపోతే గ్రూపు మారిపోవాలని వీఆర్పీ మొయ్యా కృష్ణ బెదిరిస్తున్నారని అధికారులకు తెలిపారు. మేట్లు వీఆర్పీకి ఇవ్వడానికి అని చెప్పి వారానికి రూ.100 ఇవ్వాలని తీసుకున్నారని మరికొందరు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కూలీలు పని ప్రదేశం నుంచి వెళ్లిపోవడంతో విచారణ అర్ధంతరంగా నిలిచిపోయింది. దీనిపై ఫిర్యాదుదారులు అఽఽఽధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వీఆర్పీపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, తమకు శ్రమకు తగ్గ వేతనాలు అందించాలని కోరారు. దీనిపై ఎంపీడీవోని సాక్షి సంప్రదించగా విచారణ వేగవంతం చేసి, నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని, మేట్‌లు, కూలీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కొమరవోలులో ఉపాధి కూలీల డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement